బైరెడ్డి సిద్ధార్థ్‌కు ఓ నియోజ‌క‌వ‌ర్గం కావాల‌ట‌!

వైసీపీ యువ నాయ‌కుడు, శాప్ చైర్మ‌న్ బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి ఎమ్మెల్యే కావాల‌ని బ‌ల‌మైన కోరిక వుంది. కానీ ఆయ‌న‌కంటూ ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం దొర‌క‌డం లేదు. దీంతో ఆయ‌న తీవ్ర…

వైసీపీ యువ నాయ‌కుడు, శాప్ చైర్మ‌న్ బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి ఎమ్మెల్యే కావాల‌ని బ‌ల‌మైన కోరిక వుంది. కానీ ఆయ‌న‌కంటూ ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం దొర‌క‌డం లేదు. దీంతో ఆయ‌న తీవ్ర నిరాశ‌కు గుర‌వుతున్నాయి. బైరెడ్డి కుటుంబానికి మొద‌టి నుంచి నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గం అడ్డా. 1978లో సిద్ధార్థ్ అబ్బ (తండ్రికి తండ్రి) బైరెడ్డి శేష‌శ‌య‌న‌రెడ్డి కాంగ్రెస్ (ఐ) త‌ర‌పున గెలుపొందారు. తండ్రి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి కొన‌సాగిస్తున్నారు.

కుటుంబ పెద్ద‌ల స్ఫూర్తితో బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. సిద్ధార్థ్‌కు బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్వ‌యాన పెద‌నాన్న‌. అయితే తండ్రీత‌న‌యుల మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. ఇద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి. 2009లో నందికొట్కూరు నియోజ‌కవ‌ర్గం ఎస్సీకి రిజ‌ర్వ్ అయ్యింది. ఈ నేప‌థ్యంలో బైరెడ్డి కుటుంబానికి న‌మ్మ‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం లేకుండా పోయింది. మ‌రోవైపు ఎలాగైనా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాల‌ని బైరెడ్డి సిద్ధార్థ్ బ‌లంగా కోరుకుంటున్నారు.

పాణ్యం నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆయ‌న ఆశిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అయితే అక్క‌డ కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి రూపంలో వైసీపీకి బ‌ల‌మైన నాయ‌కుడు ఉన్నారు. దీంతో అక్క‌డ అడుగు పెట్టే అవ‌కాశం లేదు. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌ల‌దూర్చే మార్గం లేకుండా పోయింది. దీంతో ఏం చేయాల‌నే ప్ర‌శ్న బైరెడ్డి సిద్ధార్థ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నంద్యాల ఎంపీ స్థానం నుంచి కూడా బైరెడ్డి సిద్ధార్థ్ పోటీ చేసే అవ‌కాశం వుంది.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్రం బైరెడ్డి సేవ‌ల్ని గుర్తించి త‌గిన రీతిలో ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. శాప్ చైర్మ‌న్‌తో పాటు ఇటీవ‌ల వైసీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్ష బాధ్య‌త‌ల్ని కూడా అప్ప‌జెప్పారు. ఇలా నామినేటెడ్ పోస్టుల్లో ఎంత కాలం అనేది బైరెడ్డి ఆవేద‌న‌. యూత్‌లో బైరెడ్డి సిద్ధార్థ్‌కు మంచి ఫాలోయింగ్ వుంది.