బీసీ గొంతుకతో బీజేపీ ఎంపీ

విశాఖ తన రాజకీయ స్థావరంగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేయలని చూస్తున్న రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇపుడు ఒక సున్నితమైన సమస్యనే పట్టుకున్నారు. దశబ్దాలుగా ఉత్తరాంధ్రా బీసీలు…

విశాఖ తన రాజకీయ స్థావరంగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేయలని చూస్తున్న రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇపుడు ఒక సున్నితమైన సమస్యనే పట్టుకున్నారు. దశబ్దాలుగా ఉత్తరాంధ్రా బీసీలు ఓబీసీలుగా తమకు గుర్తింపు కావాలని కోరుతున్నారు.

దాని మీద ఎన్నో పోరాటాలు జరిగాయి. నూటికి ఎనభై శాతం బీసీలు ఉన్న ఉత్తరాంధ్రాలో ప్రధాన కులాలుగా ఉన్న వారు అంతా ఓబీసీ కేటగిరీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు ఈ సమస్యను తాను పరిష్కారం చేస్తాను అని ముందుకు వచ్చారు.

విశాఖలో ఉత్తరాంధ్ర బిసిల సామాజిక సాధికారత సదస్సును నిర్వహించిన ఆయన తూర్పు కాఫు, శిష్టకరణ, కళింగ వైశ్య, సొంది కులాలను  ఓబీసీ క్యాటగిరీలోకి చేరుస్తామని హామీ ఇచ్చారు. అంతే కాదు, తెలంగాణలో తొలగించిన 26 బీసీ కులాలను తిరిగి చేర్చాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాలుగు ప్రముఖ కులాలకు కేంద్ర ఓబీసీ రిజర్వేషన్ రావడం లేదని, వారంతా పదేళ్ల నుంచి కేంద్ర ఓబీసీ లో చేర్చాలని కోరుతున్నారని జీవీఎల్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర లో కొందరికి బిసి గా ఉన్నా కూడా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు వెళ్తే న్యాయం జరగడంలేదని ఆయన తెలిపారు.

తాను ఈ అంశం మీద పార్లమెంట్ లో మాట్లాడానని, ఎన్ సి బి సి చైర్మన్ తో చర్చించానని ఆయన తెలిపారు. ఈ నెల 13 న ఢిల్లీలో దీని మీద   సమావేశం ఏర్పాటు చేశారని ఈ నాలుగు కులాలు ఓబీసి చేర్చాలని ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచుతున్నామని జీవీఎల్ వెల్లడించారు.

జీవీఎల్ ఉత్తరాంధ్రా బీసీల విషయంలో గట్టిగానే మాట్లాడుతున్నారు. వారికి మేలు చేయాలని అంటున్నారు. ఈ విషయంలో ఆయన సక్సెస్ అయితే కనుక రానున్న ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా ఆయనకు బీసీ కులాల నుంచి మద్దతు దక్కవచ్చు. జీవీఎల్ సైతం బీసీలు ప్లస్ కాపులు ప్లస్ ఇతర కులాలు అన్న లెక్కలతోనే విశాఖలో తనదైన రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు.