ఐటీలో విశాఖ టాప్ గా ఉందా అంటే సర్వేలు అదే చెబుతున్నాయి. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ తరువాత ఐటీ డెస్టినీగా విశాఖనే ఎంచుకునేవారు. విభజన ఏపీలో కూడా విశాఖ నంబర్ వన్ పొజిషన్ లో ఉంది. వైఎస్సార్ హయాంలో ఐటీ హిల్స్ ని విశాఖలోని మధురవాడలో ఏర్పాటు చేశారు.
ఇపుడు మరిన్ని ఆ వైపుగా వచ్చి చేరుతున్నాయి. ఐటీ దిగ్గజ సంస్థలు ప్రధాన నగరాలతో పాటు కీలకమైన నగరాలలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు విశాఖ వంటి వాటికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, బెంగళూర్ వంటి సిటీలలో ఐటీ పరంగా పూర్తి స్థాయిలో విస్తరణ జరిగింది. దాంతో తరువాత చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్ కోసం విశాఖ వంటి నగరాలనే ఐటీ సంస్థలు ఎంపిక చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్ విశాఖలో తన కార్యకలాపలను ప్రారంభించింది. అదానీ డేటా పార్క్ వచ్చింది. రహేజా గ్రూప్ కూడా విశాఖలో ఐటీ సెంటర్ ని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
వీటితో పాటుగా మరిన్ని కొత్త సంస్ఘలు దిగ్గజ కంపెనీలే విశాఖ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి తాజా సర్వే ఒకటి బలాన్ని ఇస్తోంది. నాస్కాం డెలాయిట్ సర్వే ఇటీవల దేశవ్యాప్తంగా ఎమర్జింగ్ ఐటీ సిటీల జాబితాను తయారు చేసింది. అందులో దేశంలో ఇరవై ఆరు నగరాలు ఉండగా ఏపీ నుంచి విశాఖ సహా మూడు సిటీస్ చోటు సంపాదించాయి. విశాఖ ఫస్ట్ ప్లేస్ కాగా, విజయవాడ, తిరుపతి తరువాత స్థానాలలో ఉన్నాయి.
ఈ నగరాల ప్రత్యేకత ఏంటి అంటే మానవ వనరులు సులువుగా లభ్యమవుతాయి. వసతులకు పెద్దగా ఖర్చు చేయాల్సింది లేదు, స్టార్టప్ ఎకో సిస్టమ్ కూడా బాగా ఉంటుంది. సోషల్ లివింగ్ ఎన్విరాన్ మెంట్ అంశాలలో కూడా వీటికి మంచి మార్కులు పడుతున్నాయి. దీంతో రానున్న రోజులలో విశాఖకు పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.