చిత్రం: మిస్ శెట్టి- మిస్టర్ పోలిశెట్టి
రేటింగ్: 2.75/5
తారాగణం: అనుష్క, నవీన్ పోలిశెట్టి, జయసుధ, మురళి శర్మ, తులసి, అభినవ్ గోమఠం, హర్షవర్ధన్, సొనియా తదితరులు
సంగీతం: రథన్
కెమెరా: నీరవ్ షా
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
నిర్మాతలు: వంశి- ప్రమోద్
దర్శకత్వం: మహేష్ బాబు పి
విడుదల: సెప్టెంబర్ 7, 2023
బాహుబలి తర్వాత చెప్పుకోదగ్గ విధంగా లేదు అనుష్క శెట్టి కెరీర్. అలాగని ఆమె స్టార్డం ఏమీ తగ్గలేదు. ఇప్పటికీ ఆమె సినిమా అంటే చాలా మంది ఆడియన్స్ చూడ్డానికి రెడీ అయిపోతారు. మరో పక్క నవీన్ పోలిశెట్టి “జాతిరత్నాలు” తర్వాత జనానికి బాగా దగ్గరైపోయాడు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే నాన్ సింక్ గానే అనిపిస్తుంది. అయినప్పటికీ కథాపరంగా ఇదే కరెక్టనుకున్నారు కనుక ఈ చిత్రంతో ముందుకొచ్చారు.
అన్విత (అనుష్క) లండన్లో మంచి పేరున్న చెఫ్. ఆమె తల్లి (జయసుధ) విడాకుల కారణంగా సింగిల్ మదర్. అనారోగ్యం వల్ల చావుకి దగ్గరపడిన ఆమె తన కూతుర్ని పెళ్లి చేసుకోమని కోరుతుంది. కానీ తన తల్లి పెళ్లి వల్ల పడ్డ బాధను చూసి తానసలు పెళ్లే చేసుకోకూడదనే తన నిర్ణయాన్ని చెబుతుంది అన్విత.
అయితే తల్లి మరణం తర్వాత ఒంటరితనం వల్ల తోడు కోసం ఒక బిడ్డని కనాలనుకుంటుంది…అది కూడా తాను అనుకున్నట్టు పెళ్లి చేసుకోకుండా. పుట్టే బిడ్డ మంచి లక్షణాలతో, అందంగా, అరోగ్యంగా పుట్టాలని సరైన వీర్యదాత కోసం వెతికే క్రమంలో అన్వితకి సిద్ధు (నవీన్ పోలిశెట్టి) తారసపడతాడు. అతడొక స్టాండప్ కమెడియన్. అక్కడి నుంచి ఏం జరుగుతుందనేది కథ.
గతంలో వీర్యదానం నేపథ్యంలో “విక్కీ డోనార్” వచ్చింది. కామెడీని, సైన్సుని, ఎమోషన్ ని సమర్థవంతంగా కలగలిపిన చిత్రమది. దానినే తెలుగులో “నరుడా డోనరుడా” అని తీసారు. ఈ చిత్రం కూడా కథ వేరైనా ఆ మూడింటిని మేళవించి అదే వీర్యదానం నెపథ్యంలో తీసిందే.
ఇలాంటి సినిమాలని నడపాలంటే ఆసక్తికరమైన సంభాషణలుండాలి. ఆ విషయంలో మంచి మార్కులు వేయించుకున్న చిత్రమిది.
పాటలు ఆకట్టుకోవాలి. ఆ విషయంలో మాత్రం వెనుకబడ్డ సినిమా ఇది. తెర మీద చూస్తున్నప్పుడు సందర్భోచితంగా సాహిత్యం పర్వాలేదనిపిస్తుంది కానీ ఒక్కటంటే ఒక్క ట్యూన్ కూడా హాంటింగ్ గా లేదు. పైగా పాటలన్నీ ఆల్రెడీ ప్రోజులో చూస్తున్న కథనే మళ్లీ పొయెట్రీలో చెప్తున్నట్టుగా రిపిటిటివ్ గా ఉంది తప్ప కొత్త ఫీల్ అందివ్వలేదు. ఓవరాల్ గా ఈ సినిమాకి పాటల్లో సంగీతం వీక్. నేపథ్య సంగీతంలో పెద్ద ఇబ్బందేమీ లేదు.
కెమెరా వర్క్ వగైరాలన్నీ కంటికింపుగా ఉన్నాయి.
దర్శకుడు పి మహేష్ బాబుని ఒక విషయంలో అభినందించాలి. ఈ కాన్సెప్ట్ ని ఎంచుకుని కామెడీ పేరుతో ఏమాత్రం గీత దాటినా చాలా ఇబ్బందికరంగా ఉండేది. అలా జరగకుండా సున్నితమైన సబ్జెక్ట్ ని సున్నితంగా డీల్ చేసిన విధనాం బాగుంది.
స్టాండప్ కమెడియన్ పాత్రని హీరోకిచ్చి నడిపించడం సాధారణమైన విషయం కాదు. ఆ పాత్రకి నవీన్ పోలిశెట్టి తప్ప తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంకెవ్వరూ సెట్ కారనిపిస్తుంది. అతని టైమింగ్ అలాంటిది. అయితే స్టాండప్ కామెడీ పేరుతో స్టేజ్ మీద చేసిందానికంటే నవీన్ అసలు కథలో ఆద్యంతం స్టాండప్ కమెడియన్ టైపులోనే నవ్వించాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు.
అనుష్క పాత్ర చాలా కంపోజ్డ్ గా, రిజర్వ్డ్ గా, మెచ్యూర్డ్ గా సాగింది. కథలో తన నేపథ్యానికి అతికినట్టుగా నటించింది. కథాపరంగా హీరోకంటే ఆమె వయసు పెద్దదే కాబట్టి ఎక్కడా ఎబ్బెట్టుగా లేదు. పాత్రకి పూర్తిగా సరిపోయిందామె.
ఫెర్టిలిటీ డాక్టర్ గా హర్షవర్ధన్ కనిపించిన కాసేపూ నవ్వించాడు. ఎంత స్క్రీన్ స్పేస్ ఇచ్చినా తన ఉనికి చాటుకోగల నటుడని మరోసారి నిరూపించాడు.
ప్రారంభంలో కాసేపు కనిపించిన జయసుధ కూడా సటిల్ డైలాగ్స్ తో చాలా కూల్ గా, మెచ్యూర్డ్ గా కనిపించింది.
అనుష్క ఫ్రెండ్ గా సోనియా, నవీన్ ఫ్రెండ్ గా అభినవ్ గోమఠం ఓకే. మురళిశర్మ, తులసి జంట బాగుంది.
కథలో ఊపు నవీన్ పాత్ర ఎంటరైనప్పటి నుంచి మొదలౌతుంది. ఈ చిత్రంలో ప్రధానమైన మైనస్ ఊహించినట్టుగా కథ నడవడం. ప్లస్ ఏంటంటే అలా నడిచినా కూడా చివర్లో ఎమోషన్ పండించగలగడం. ప్రధమార్ధం ఆసక్తిగా సాగినా, ద్వితీయార్థం మాత్రం పడుతూ లేస్తున్నట్టు అనిపిస్తుంది.
లోటుపాట్లున్నా కూడా మెచ్యూరిటీ ఉన్న దర్శకుడు కథ రాసుకుని తీస్తే సబ్జెక్ట్ ఏదైనా ఎంత డీసెంటుగా ఉంటుందో చెప్పే సినిమా ఇది. ఈ చిత్రం నవీన్ పోలిశెట్టి అభిమానుల్ని నిరాశపరచదు. వీర్యదానం కాన్సెప్టునే ఇబ్బందిగా ఫీలయ్యే వాళ్లు దూరంగా ఉండొచ్చు. తక్కిన వాళ్లు కామెడీతో సెంటిమెంటుని కలగలిపి వండిన వంటకాన్ని రుచి చూడొచ్చు.
హీరోది స్టాండప్ కామెడీ, హీరోయిన్ ది స్టార్ హోటల్ వంటకం, దర్శకుడిది మెచ్యూరిటీ. ఆ మూడింటి సమ్మేళనమే ఈ చిత్రం.
బాటం లైన్: మెచ్యూర్డ్ కామెడీ వంటకం