స్వయంభు.. ఈ ప్రాజెక్టుపై చాలా ఆశలు పెట్టుకున్నాడు హీరో నిఖిల్. ఓవైపు స్పై సినిమా విడుదలకు సిద్ధమైన టైమ్ లో కూడా స్వయంభు వ్యవహారాలు మొదలుపెట్టాడంటే, నిఖిల్ ఈ ప్రాజెక్టుపై ఎంత సీరియస్ గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తన కెరీర్ లో మరో పాన్ ఇండియా హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాడు ఈ నటుడు.
అందుకే, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా, వియత్నాం వెళ్లాడు. స్వయంభు సినిమా కోసం వియత్నాం వెళ్తున్న విషయాన్ని నిఖిల్ స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు అతడు ఓ వీడియో కూడా షేర్ చేశాడు.
స్వయంభులో తొలిసారిగా యోధుడిగా కనిపించబోతున్నాడు నిఖిల్. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా ఇప్పటికే రిలీజైంది. ఈ సినిమాలో నిఖిల్ కత్తియుద్ధాలు, గుర్రపు స్వారీ, విలువిద్య లాంటివి చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మార్షల్ ఆర్ట్స్, పార్కోర్ స్టంట్స్ కూడా చేయాలి. వీటిలో ట్రయినింగ్ తీసుకునేందుకు వియత్నాం వెళ్లాడు ఈ నటుడు.
పిక్సెల్ స్టుడియోస్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మాతగా తెరకెక్కుతోంది స్వయంభు సినిమా. భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేశారు. ఈ సినిమా కోసం మంచి టెక్నికల్ టీమ్ ను తీసుకున్నారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించబోతున్నాడు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్.
కార్తికేయ-2తో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు నిఖిల్. అయితే ఆ వెంటనే 18-పేజెస్, స్పై సినిమాలతో ఫ్లాపులిచ్చాడు. దీంతో స్వయంభు సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.