తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఎందరు ఉన్నప్పటికీ కెసిఆర్ సర్కారు మీద రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం సాగిస్తున్నారనేది నిజం. నిత్యం కుమ్ములాటలతో సతమతమవుతూ ఉండే కాంగ్రెస్ పార్టీ దానికి అంతర్గత ప్రజాస్వామ్యం అనే అందమైన ముసుగు తొడుక్కుని ఆత్మవంచన చేసుకుంటూ ఉంటుంది. రేవంత్ రెడ్డిని పిసిసి సారధిగా ఎంపిక చేసిన నాటి నుంచి పార్టీలోని సీనియర్లు అన్ని రకాలుగాను ఆయనకు సహాయ నిరాకరణ చేస్తూ వస్తున్నారు.
పైపెచ్చు రేవంత్ మీద రాళ్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. గోతులు తవ్వుతున్నారు. రేవంత్ సారధ్యంలో పార్టీ అధికారంలోకి వస్తే తమ ప్రాభవానికి గండిపడుతుందేమో అని భయపడుతున్నట్లుగా తెరవెనుక వ్యూహాలు రచిస్తున్నారు. ఆయన మీద పార్టీ అధిష్టానానికి పితూరీలు చేస్తూ వస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఏదో ఒక రకంగా పార్టీని నెట్టుకు వస్తున్న రేవంత్ రెడ్డి తాజాగా పాలమూరు జిల్లాలో అన్ని సీట్లను తాను గెలిపిస్తానని ప్రతిజ్ఞ చేశారు. పాలమూరు జిల్లా మొత్తానికి తాను బాధ్యత వహిస్తానని తేల్చి చెప్పారు.
గత అసెంబ్లీ ఎన్నికలలో తన సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు జిల్లా మొత్తంలో అన్ని సీట్లలో గెలిపిస్తాను.. అందుకు బాధ్యతలు తీసుకుంటాను.. అని ప్రకటించడం ప్రజలకు కాస్త కామెడీగా అనిపిస్తుంది. ఆ మాటకొస్తే.. రాష్ట్ర పార్టీకి సారథ్యం వహిస్తున్న వ్యక్తి జిల్లా అధ్యక్షుడిలాగా.. ఆ జిల్లాలో గెలుపోటముల పూచీ తీసుకుంటే ఎలాగ? మిగిలిన జిల్లాల సంగతి ఎవరు చూసుకోవాలని, తన తరహాలో బాధ్యత తీసుకోవాలని ఆయన అనుకుంటున్నారు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి.
రాష్ట్ర సారథి రాష్ట్రమంతా పార్టీని గెలిపిస్తానని అనాలి గానీ.. ఒక జిల్లాను మాత్రం గెలిపిస్తా అనడం ఏరకంగా కరెక్టు అనేవాళ్లు కూడా ఉన్నారు. ఆ సంగతి పక్కన పెడితే అసలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో తన ప్రాబల్యం ఎలా నిరూపించుకోబోతోంది అనేదే సందేహంగా మారుతోంది? ఇప్పటికీ నాయకులు ఒక్కతాటి మీదకు రావడం లేదు. రేవంత్‌కు అనుకూలంగా ఉన్నాడనే ఫిర్యాదుల మీద మాణిక్యం ఠాగూర్ ను, పక్కకు తప్పించి మాణిక్యం ఠాక్రేను ఇంచార్జిగా తెచ్చారు. ఇన్చార్జి మారినంతమాత్రాన ఇక్కడి ముఠా, వర్గ పోరాటాలన్నీ ఓ కొలిక్కి వచ్చేస్తాయి అనుకోవడం భ్రమ.
ఇన్ని రకాల కష్టనష్టాలు పొంచి ఉండగా పాలమూరు జిల్లాలో ఉన్న సీట్లు అన్ని నేనే గెలిపిస్తాను.. అంటూ రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకుని తనను కమిట్ చేసుకోవడం అవసరమా.. తద్వారా కొత్త విమర్శలు కొనితెచ్చుకున్నట్టవుతుంది కదా అని పలువురు భావిస్తున్నారు.