ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్-1 హైకోర్టులో తీవ్ర పరిణామాలకు దారి తీసింది. సంక్రాంతి సెలవులను పురస్కరించుకుని అత్యవసర కేసుల విచారణ నిమిత్తం వెకేషన్ బెంచ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జీవో నంబర్-1పై వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. అయితే ప్రభుత్వ విధానపర నిర్ణయాలపై విచారించే అధికారం వెకేషన్ బెంచ్‌కు లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది ఏజీ శ్రీరాం గట్టిగా వాదించారు.
ఈ వాదనలను జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని హైకోర్టు డివిజన్ బెంచ్ పట్టించుకోలేదు. విచారణలో భాగంగా ప్రభుత్వంపై జస్టిస్ దేవానంద్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జీవోను సస్పెండ్ చేశారు. దీనిపై సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ విచారించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇవాళ విచారణలో భాగంగా వెకేషన్ బెంచ్‌పై ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెకేషన్ బెంచ్ తన పరిధి అతిక్రమించి జీవో నంబర్-1పై విచారించిందన్నారు. వెకేషన్ బెంచ్ డీఫాక్టో చీఫ్ జస్టిస్‌లా వ్యవహరించిందని ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి కేసు ముఖ్యమైందే అనుకుంటే హైకోర్టు ఏమైపోవాలని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించడం గమనార్హం.
ముఖ్యమైన కేసులంటూ విచారించుకుంటూ వెళితే… ప్రతి వెకేషన్ జడ్జి చీఫ్ జస్టిస్ అయిపోయినట్లేనని సీరియస్ కామెంట్స్ చేశారు. అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేసు మూలాల్లోకి వెళ్లి తెలుసుకున్నానని చీఫ్ జస్టిస్ అన్నారు. తనకేమీ తెలియదని అనుకోవద్దని, రిజస్ట్రీ ఎప్పటికప్పుడు తనకు నివేదించిందని చీఫ్ జస్టిస్ అన్నారు.
తన పిటిషన్ స్వీకరించాలంటూ వెకేషన్ కోర్టు ముందు ధర్నా జరిగిందా? అంత అర్జెంటుగా వెకేషన్ బెంచ్‌లో లంచ్ మోషన్ ఎందుకు వేశారని సంచలనం కలిగించే రీతిలో ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అత్యవసరం లేనప్పుడు లంచ్ మోషన్ వేయాల్సిన అవసరమేంటని నిలదీయడం గమనార్హం. ఇదిలా వుండగా అసలు కేసు విచారణకు రాకూడదని తెర వెనుక ఏం జరిగిందో తనకు తెలుసని, ఆ విషయాలు బెంచ్‌పై నుంచి చెప్పించొద్దని ఇటీవల జీవో నంబర్-1పై విచారణలో వెకేషన్ బెంచ్ జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
బహుశా వాటికి కౌంటర్‌గా అనే రీతిలో తనకేమీ తెలియదని అనుకోవద్దని చీఫ్ జస్టిస్ అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అలాగే రిజస్ట్రీ ఎప్పటికప్పుడు నివేదిస్తోందని చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీవో నం బర్-1 చివరికి వెకేషన్ బెంచ్ వర్సెస్ హైకోర్టు అనే అభిప్రాయాన్ని కలిగించేలా పరిణామాలు చోటు చేసుకున్నాయని అంటున్నారు. విచారణలో భాగంగా సంచలన కామెంట్స్ చోటు చేసుకున్న నేపథ్యంలో తీర్పు ఎలా వుంటుందోననే ఉత్కంఠ నెలకుంది.