అధికారంలో ఉన్న వైసీపీని ఓడించడం…. ప్రతిపక్షం లో ఉన్న టీడీపీకి ఇప్పుడు పైకి కనపడుతున్నంత సులభం కాదు.
నిజమే! చంద్రబాబు రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. జనం కూడా ఈ సభలకు పెద్ద ఎత్తున వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్‌ను చంద్రబాబు విమర్శించిన సందర్భాలలో జనంలో స్పందన కూడా కనిపిస్తున్నది. మరో వైపు నారా లోకేష్ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రినీ గట్టిగానే విమర్శిస్తున్నారు. ప్రధాన ప్రింట్ మీడియా అయిన మూడింటిలో 'సాక్షి' ని మినహాయించి, ఈనాడు, ఆంధ్రజ్యోతి జగన్ పై, వైసీపీ ప్రభుత్వ చర్యలపై విరుచుకు పడుతున్నాయి. ఇక చానల్స్ లో టీవీ5, ఏబీఎన్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను రోజువారీగా ఉతికి ఆరేస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక కథనాలు విస్తృతంగా వస్తున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం జనంలో బాగానే కనబడుతున్నదనే భావన కూడా గట్టిగానే ఉంది. తెలుగుదేశం నాయకులు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడకుండా సూర్యుడు అస్తమించడం లేదు, ఉదయించడం లేదు. మరో పక్కన మరో రెండు రోజుల్లో – 4000 కిలోమీటర్లు మీటర్లు…400 రోజులు అంటూ పాదయాత్రకు నారా లోకేష్ రెడీ అయిపోయారు. ఈ పాదయాత్రతో, జగన్ ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు ఖాయమంటూ టీడీపీ సీనియర్లు ప్రకటనలు గుప్పిస్తున్నారు.
అలా, లోకేష్‌ను సమర్ధించకపోతే…. ఆయన దృష్టిలో మైనస్ మార్కులు పడతాయేమో అనేది వారి భయం. లోకేష్‌ను… ఆయన పుట్టక ముందు టీడీపీలో ఉన్నవారు కూడా ఆకాశానికి ఎత్తేస్తున్న తీరు చూస్తుంటే, టీడీపీలో తరం మారిపోయిందా అన్న అనుమానం కలుగుతోంది.
అయితే, ఆవిషయం కాసేపు పక్కన బెడితే, రానున్న ఎన్నికల్లో గెలవడానికి ఇవి సరిపోతాయా… అనేది పరిశీలించాలి.
వచ్చే ఎన్నికల్లో వైసీపీని టీడీపీ కూటమి ఓడించడం అనేది అంత తేలికైన విషయంలా కనిపించడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక భావనకు 'ఆ రెండు' పత్రికలు, ' ఆ మూడు ఛానళ్ళు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని కూడా 'జనసేన' అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే ప్రకటిస్తున్నారు. 2019లో కావలసిన 'జ్ఞానోదయం' ఆయనకు ఇప్పుడు అయినట్టుంది.
అయితే, ఇందుకోసం, టీడీపీతో చేతులు కలిపి పోటీకి వెళతామని మాత్రం ఆయన ఇంకా చెప్పడం లేదు. బహుశా, తన బలం బాగా పెంచుకుని, అప్పుడు టీడీపీతో బేరానికి దిగుతారేమో తెలియదు. టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తే, తమకు 60 శాతం ఓటు షేర్ లభిస్తుందని ఒక సర్వేలో తేలిందని ఒక ముఖ్యమైన టీడీపీ నేత చెప్పారు. ఈ పొత్తుపై టీడీపీలో ఆరేంజ్‌లో ధీమా కనపడుతున్నది.
అయినప్పటికీ, వైసీపీని ఓడించడం టీడీపీ కూటమికి అంత తేలిక కాదు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రతిపక్షాలకు అనేక కారణాలు లేకపోలేదు. మీడియాకూ ఉన్నాయి. సోషల్ మీడియాకు ఉన్నాయి. ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఉన్నాయి. సీపీఐ నారాయణకూ ఉండేవే గానీ, ఆయన అమెరికా వెళ్లడంతో, ఆ పాత్రను ఏపీ శాఖ కార్యదర్శి రామకృష్ణ పోషిస్తున్నారు. ఏమైనా, నారాయణ అందుబాటులో లేని లోటు…. లోటే కదా! అయినప్పటికీ, వైసీపీని క్షేత్ర స్థాయిలో ఓడించడం అంత తేలికైన విషయం కాదు.
వైసీపీ అంటే జగన్
జగన్ అంటే, జ'గన్నే'!. ఆయనకూ, ఆయనను అను నిత్యం విమర్శించే చంద్రబాబు నాయుడికీ మధ్య చాలా వ్యత్యాసం అదే. చంద్రబాబు రోజూ మీడియాతో మాట్టాడాలి. ఆయనతో బాటు, టీడీపీ నేతలూ మాట్లాడాలి. సీపీఐ రామకృష్ణ మాట్లాడాలి. ప్రభుత్వ వ్యతిరేక గొంతులు రోజూ మీడియాలో మాట్లాడాలి. ఇక, ఛానల్ డిబేట్లు సరే సరి.
కానీ, వైసీపీ అనేది ఒక మూసిన గుప్పిట. జగన్ సైతం మీడియాతో మాట్లాడరు. ఆయన కోరుకున్నప్పుడు తప్ప, ఎమ్మెల్యేలు, మంత్రులకు సైతం ఆయన అందుబాటులో ఉండరనే భావన వైసీపీలో ఉంది. అయినప్పటికీ, ఆయన కోసం ప్రాణం పెట్టే విధేయుల బృందానికి మరో పేరు – 'వైసీపీ'.
వచ్చే ఎన్నికల్లో కంఫర్ట్ బుల్ గా గెలవడానికి అవసరమైన 'జగన్ వ్యూహాలు' జగన్ కు ఉన్నాయి. ఆయన మనసులోకి దూరి, ఆ వ్యూహలకు అనుగుణమైన కార్యాచరణను క్షేత్ర స్థాయిలో అమలు చేసి చూపించగలిగిన విధేయ, అభిమాన, విశ్వాసపాత్ర సైన్యం ఆయన స్వంతం.
'చూసి రమ్మంటే… కాల్చేసి వచ్చిన' వీర, విధేయ ఆంజనేయులు ఆయన బలం. వీరికి వైసీపీ సుప్రీం కమాండర్ జగన్ వాక్కే వేదవాక్కు. వీరు రాష్ట్రమంతా ఉన్నారు. ప్రతి నియోజక వర్గంలో ఉన్నారు. గ్రామ, గ్రామానా ఉన్నారు. ఎన్నికల్లో గెలవడానికి ఏమి చేయాలో వారికి తెలుసు. ప్రతిపక్షాలను ఎలా 'హ్యాండిల్' చేయాలో వారికి తెలుసు. వారి ముందు, ప్రతిపక్షాల వారు నిలువలేరు అనేది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రుజువైంది.
ప్రతిపక్షాల వారు వాక్సూరులు మాత్రమే . వైసీపీ వారు కార్యసూరులు. ఏం చేస్తారో చెప్పరు. చేసి చూపిస్తారు. అందుకే, 175 కి 175 అని జగన్ అంటున్నారు. సరదాకు అనడం లేదు. ఆయనకు ఆ 'కెపాసిటీ' ఉంది. ప్లానింగ్ సైతం ఉండే ఉంటుంది. దానిని ఎదుర్కొనే వ్యూహం టీడీపీకి గానీ, దానితో పొత్తు ఉంటుందని అనుకునే జనసేనకు గానీ ఉన్నదని అనిపించడం లేదు. కుప్పంలో చంద్రబాబు గానీ, విశాఖపట్నం లో పవన్ కళ్యాణ్ గానీ పర్యటించలేకపోవడమే ఇందుకు నిదర్శనం. వీరివి 'నెగటివ్' పాలిటిక్స్ కావడమే ఈ పరిస్థితికి కారణం.
నేల విడిచి సాము చేస్తున్నారు
చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు, రామకృష్ణుడు, పట్టాభిరాం, అశోక్ బాబు, దూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా, బుచ్చయ్య చౌదరి, ఆనంద బాబు, అనిత, వర్ల రామయ్య…. ఇలా తెలుగు దేశం నాయకులు జనసేన వైసీపీని, జగన్ ను రోజూ విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. టీవీ డిబేట్లలో దుమ్మెత్తి పోస్తున్నారు. కానీ, కొత్తవిషయం ఏమి ప్రజలకు చెబుతున్నారో అర్ధం కావడం లేదు. వారు చేసే విమర్శలన్నీ జనానికి తెలిసినవే. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే చంద్రబాబు – వైసీపీ ప్రభుత్వం, జగన్ పై చేసే విమర్శల్లో కొత్త విషయం కనిపించడం లేదు. చెప్పిందే చెప్పడం. విమర్శించిందే…. విమర్శించడం. వాక్సూరత్వం అంటే ఇదే. అందుకే టీడీపీ, జనసేనది వాక్సూరత్వం. మీడియా లేకపోతే వారు లేరు.
జగన్ కార్యసూరుడు. మీడియాతో ఆయనకు పని లేదు.అందుకే, వీటిపై ఆయన స్పందించరు. మీడియాతో మాట్లాడరు. చేయాల్సింది… చేసి చూపిస్తారు. జగన్, వైసీపీని తట్టుకోవాలి అంటే టీడీపీ, జనసేన, సిపిఐ పార్టీలు 'నెగటివ్' పాలిటిక్స్ కు స్వస్తి చెప్పాలి. ' పాజిటివ్ పొలిటిక్సే శరణం గచ్చామి…' అనాలి.
ప్రజల్లోకి వెళ్ళాలి. వారి తక్షణ సమస్యలు ఏమిటో తెలుసుకోవాలి. తమ కార్యకర్తల బలగాలను రంగంలోకి దింపి, ఆ సమస్యల పరిష్కారానికి తమ స్థాయిలో చేయగలిగింది చేయాలి. చేస్తున్నారనే భావం… సంబంధిత ప్రజలకు కలగాలి. ఇందుకు మీడియా డప్పు అవసరం లేదు.
జగన్, వైసీపీపై పల్లెత్తు విమర్శకు సైతం దూరంగా ఉండాలి. అంతే తప్ప జగన్‌ను, ఆయన పాలనను విమర్శించడం ద్వారా, మీడియా టముకు ద్వారా ప్రజాభిమానాన్ని ప్రతిపక్షాలు చూరగొనలేవు.
వచ్చే ఎన్నికలు….' డూ ఆర్ డై ' స్థాయిలో ఉంటాయనే విషయం అటు అధికార పక్షానికి, ఇటు ప్రతిపక్షానికి తెలుసు.2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఉన్నంత ఉదాసీనంగా… రేపటి ఎన్నికల ముందు జగన్ ఉండరు. ఆ విషయం చంద్రబాబు గమనించారో… లేదో తెలియదు.
ప్రభుత్వాన్ని రకరకాల పద్ధతుల్లో విమర్శించడం లోనో… ప్రతిపక్ష సభలు – సమావేశాలకు పెద్ద ఎత్తున జనం రావడం లోనో… ట్విట్టర్‌లో అవి చేసే వ్యంగ్య వ్యాఖ్యనాలలోనో ఓట్లు లేవు. ' ఇంకెక్కడో…' ఉన్నాయి. ఎక్కడ… ఏమిటి…ఎప్పుడు…ఎలా…. అనే విషయాలు క్షుణ్ణంగా తెలిసిన వైసీపీని ఎన్నికల్లో ఓడించడం టీడీపీ, జనసేనకు అంత ఈజీ కాదు.
పులివెందుల, కడప లో గత 45 ఏళ్ళ నుంచీ ఎన్నికల్లో నిరంతరాయంగా విజయం సాధిస్తున్న అనుభవం వై.ఎస్ కుటుంబానికి ఉంది. జగన్ శకం ప్రారంభం కాకముందు, పులివెందుల అసెంబ్లీ…., కడప లోకసభ నియోజకవర్గానికే పరిమితమై ఉన్న ఆ అనుభవం ఇప్పుడు రాష్ట్రం మొత్తం విస్తరించింది.
ఆ విషయం గమనంలోకి తీసుకోకుండా, వైసీపీకి పది… పదిహేను సీట్లు మించి సీట్లు రావూ అంటూ ఏవేవో అవాకులూ, చవాకులూ…. చేస్తున్న ప్రచారం, వేస్తున్న పిల్లి మొగ్గలు చూస్తుంటే . …వీళ్ళు జగన్ శక్తి యుక్తుల్ని, ఆయనకు గల కమిటెడ్ ఓటు బ్యాంకు ని ఎంత తక్కువగా అంచనా వేస్తున్నారా అని ఆశ్చర్యం వేస్తుంటుంది.
175 కి 175 స్థానాలలో విజయం సాధించాలని జగన్ సరదా కోసమో…. మాట వరుసకో అనడం లేదు. తన, తన అనుచరుల దక్షతపై అంత నమ్మకం ఉండబట్టే…., ఆయన ఆ మాట అంటున్నారు. ప్రభుత్వ వ్యవహార శైలిలోని మంచి చెడ్డలకు… ఎన్నికల్లో జయాపజయాలకు అసలు సంబంధమే లేదు. 2014 నుంచి 2019 వరకు బ్రహ్మాండంగా పరిపాలించామని తెలుగు దేశం నాయకులు చెబుతున్నారు. మరి, 23 సీట్లే ఎందుకు వచ్చాయి అని ఎప్పుడైనా ఆత్మ పరిశీలన చేసుకున్నారా ? అంటే – ఎన్నికల 'మేనేజ్మెంట్' కి…టీడీపీకి లంకె కుదరలేదు అని అర్ధం కదా! లేదా – చంద్రబాబు అనుసరించిన ' సాంప్రదాయ' ఎన్నికల మేనేజ్ మెంట్ 2019 ఎన్నికల్లో పనిచేయలేదు అని అయినా అనుకోవాలి . మరి, ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల మేనేజ్ మెంట్….. చంద్రబాబు మేనేజ్ మెంట్ లాటిది కాదు కదా! ఆ విషయం గమనంలోకి తీసుకోకుండా, వైసీపీ ని ఓడించ గలమని టీడీపీ + జనసేన + సీపీఐ+ వగైరా + వగైరా ఎలా అనుకుంటున్నాయో అర్ధం కావడం లేదు. అది అంత వీజీ కాదు.
“కనిపించే దానిని చూడడానికి కళ్ళు సరిపోతాయి. కనిపించని దానిని చూడడానికి వివేకం కావాలి ” అనే సూక్తి ప్రతిపక్షాలకు బాగా వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎటు పోతుంది అంటూ ప్రతిపక్షాలు అతిగా ఆలోచించి, ఆందోళన చెంది, గొంతు చించుకుని, బీపీ లు తెచ్చుకుని…జుట్లు పీక్కో వలసిన పని లేదు. ప్రజల వివేకం, విజ్ఞత, మైండ్ సెట్, ఆలోచనలకు తగిన పార్టీయే అధికారం చేపడుతుంది. వారి అభీష్టం మేరకే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. వైసీపీ వల్ల ఆంధ్రప్రదేశ్ భవితవ్యం పాడైపోయిందనో… బ్రహ్మాండంగా ఉన్నదనో భావించాల్సింది…. సంతోషించాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మూడు కోట్ల మంది ఓటర్లు. ప్రతిపక్షాలు కాదు. కందకు లేని దురద…. పెండలానికి ఎందుకు?
భోగాది వేంకట రాయుడు