దేశంలో కరోనా నియంత్రణ సాధ్యం అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. జూన్ మొదటి వారం నుంచి దేశంలో విజృంభిస్తూ వస్తున్న కరోనా.. ప్రస్తుతం ఇండియాలో పీక్స్ లో ఉంది. ఏ దేశంలోనూ రిజిస్టర్ కాని రీతిలో రోజుకు 90 వేల స్థాయిలో కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. రికవరీ రేటు మంచి స్థాయిలోనే ఉన్నా.. గత పక్షం రోజుల నుంచి యాక్టివ్ కేసుల లోడు అమాంతం పెరుగుతూ ఉంది. ఈ పరిస్థితిని చూస్తుంటే.. ఇండియాలో ఇంకా కరోనా ఏ స్థాయికి వెళ్తుంది? అనేది ఒకింత భయాందోళలలను రేపుతున్న అంశం అవుతోంది.
జనం మాత్రం ఇవేం పట్టనట్టుగా కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా తిరుగుతున్న వైనాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలో ఎలాంటి లాక్ డౌన్ పరిమితులు లేవు. అంతా అన్ లాకే. చాలా రాష్ట్రాల్లో బార్లూ, పబ్బులు కూడా తెరుచుకుంటున్న పరిస్థితి నెలకొంది.
కరోనాకు జనాలు భయపడుతున్నారు కానీ, అందుకు సంబంధించి జాగ్రత్త చర్యలు ఎంత వరకూ తీసుకుంటున్నారనేది ప్రశ్నార్థకమే. ఈ క్రమంలో వ్యాక్సిన్ వస్తే తప్ప ఇండియాలో కరోనా కేసులు తగ్గవేమో అనే ఒక అభిప్రాయం ఏర్పడుతూ ఉంది. సెప్టెంబర్ కు తగ్గుముఖం పడుతుంది, అక్టోబర్ కు తగ్గుతుంది అనే అంచనాలకు, ఆశలకు కూడా ఇప్పుడు ఊతం లేకుండాపోతోంది. పెరుగుతున్న కేసులు కరోనా తగ్గుముఖం పడుతుందనే అంచనాలకు ఆస్కారం లేకుండా చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యాక్సిన్ ప్రయత్నాల మీద దృష్టి పెట్టిందని తెలుస్తోంది. ప్రపంచంలో చాలా మంది పరిశోధకులు వ్యతిరేకిస్తున్న రష్యా వ్యాక్సిన్ మీద కూడా ఇండియా సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. తమ వ్యాక్సిన్ విజయవంతం అని రష్యా ప్రకటించింది. అయితే మిగతా దేశాలు, వైద్య పరిశోధన సంస్థలు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు.
తాజాగా ఒక పరిశోధన పత్రంలో రష్యా వ్యాక్సిన్ కు సానుకూలంగా ఫలితాలను ప్రకటించారు. అయితే అది కేవలం 77 మంది పై జరిపిన పరిశోధనేనట ఇంకా ట్రయల్స్ కొనసాగాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయినా ఏ పుట్టలో ఏ పాముందో తెలియని పరిస్థితుల్లో .. రష్యా వ్యాక్సిన్ విషయంలోనూ ఇండియా సంప్రదింపులు చేస్తోందని తెలుస్తోంది. ఈ వారంలో కేంద్రమంత్రి జైశంకర్ రష్యా వెళ్తున్నారట.. ఈ సమయంలో ఈ వ్యాక్సిన్ విషయంలో చర్చలు మరింత ముందుకు సాగుతాయని తెలుస్తోంది.