బిహార్ ఎన్నిక‌లు..సుశాంత్ ఫొటోల‌తో బీజేపీ ప్ర‌చారం!

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణంపై ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాద్ధాంతం అంతా బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని జ‌రుగుతున్న‌దే అనేది బ‌లంగా వినిపిస్తున్న ఒక అభిప్రాయం. బాలీవుడ్ లో ప‌లువురు…

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణంపై ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాద్ధాంతం అంతా బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని జ‌రుగుతున్న‌దే అనేది బ‌లంగా వినిపిస్తున్న ఒక అభిప్రాయం. బాలీవుడ్ లో ప‌లువురు బిహారీలు స్టార్లుగా ఎదిగారు. అలాంటి వారికి బిహార్ లో బ్ర‌హ్మాండ‌మైన పాపులారిటీ స‌హ‌జంగానే ఏర్ప‌డింది. అలాంటి వారు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి స‌త్తా చూపించారు. ఇలా సినిమా ఇమేజ్ అక్క‌డ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌దు. ఈ క్ర‌మంలో యంగ్ స్టార్ సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం బిహారీల‌ను బాగా బాధించింది. ఇందులో కుట్ర ఉందంటూ కొన్ని రాజ‌కీయ పార్టీలు.. లోక‌ల్ గా ప్రయోజ‌నాల‌ను పొందే ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌నే వాద‌న ఉంది. 

సుశాంత్ ది హ‌త్య అనే ఆధారాల‌ను ఇప్ప‌టి వ‌ర‌కూ సీబీఐ సంపాదించిన దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు ఆ కేసును విచారిస్తున్న మీడియా వ‌ర్గాలు కూడా డ్ర‌గ్స్ కోణంలో మాట్లాడుతున్నాయి.  అంతిమంగా సుశాంత్ నే దోషిగా నిల‌బెడుతున్నాయి!

మ‌రోవైపు బిహార్ లో భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న ప్ర‌చార ప‌త్రాల్లో సుశాంత్ ను కూడా సొంతం చేసుకున్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. జ‌స్టిస్ ఫ‌ర్ సుశాంత్ అంటూ కమ‌లం పార్టీ త‌న పార్టీ గుర్తుతో కూడిన స్టిక్క‌ర్ల‌ను విడుద‌ల చేసి, పంచుతోంద‌ని తెలుస్తోంది. 

ఇలా సుశాంత్ మ‌ర‌ణంపై బిహార్ లో నెల‌కొన్న ఎమోష‌న్ ను బీజేపీ త‌న రాజ‌కీయ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉప‌యోగించుకుంటోంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మ‌రీ ఇలా బీజేపీ త‌న గుర్తుతో కూడుకున్న పోస్ట‌ర్ల‌లో సుశాంత్ ఫొటోను వాడుకుంటూ ఉండ‌టం, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో బీజేపీ మ‌రీ ఇలా రంగంలోకి దిగ‌డం ప‌ట్ల ప్ర‌త్య‌ర్థులు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. బీజేపీ ఇలాంటి ఎమోష‌న్ల‌ను ఎగ‌దోసి త‌ను ల‌బ్ధి పొందాల‌నే ర‌కం అని, ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు ఇలాంటి ఎమోష‌న్ల‌తో రాజ‌కీయ ల‌బ్ధి పొంద‌డం బీజేపీకి కొత్త‌కాద‌ని కూడా వారు విరుచుకుప‌డుతున్నారు. 

కొంచెం కొత్తగా.. కొత్త పలుకు