2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓ స్లోగన్ అద్భుతంగా పనిచేసింది. అదే ''బై..బై బాబు'' నినాదం. ఇది ఎంత వైరల్ అయిందంటే.. సోషల్ మీడియాలో అప్పట్లో ఈ స్లోగన్ పై వచ్చినన్ని మీమ్స్, రీమిక్స్ లు దేనిపై రాలేదు.
జగన్ వేవ్ కు ఆ స్లోగన్ కూడా తోడై బాబుకు జనం నిజంగానే ''బై'' చెప్పారు. అయితే అది ఓ మోస్తరు వీడ్కోలు మాత్రమే. చంద్రబాబుకు అసలైన వీడ్కోలు సన్మానం ఈరోజు జరిగింది. ఈసారి బాబుకు ప్రజలు ఏకంగా గుడ్ బై చెప్పారు. కుప్పం వేదికగా ఆవిష్కృతమైంది ఈ చారిత్రక ఘట్టం.
ఇన్నాళ్లూ చంద్రబాబు ఏ ప్రాంతాన్ని తన కంచుకోటగా భావించారో, ఏ ప్రాంతంలో తనకు తిరుగులేదని విర్రవీగారో, ఏ ప్రాంతం ప్రజలు తనకు బ్రహ్మరథం కడతారని భ్రమించారో.. ఇప్పుడు అదే ప్రాంతంలో చంద్రబాబుకు ఘోర అవమానం ఎదురైంది.
కుప్పం మున్సిపాలిటీని బాబు దక్కించుకోలేకపోయారు. అలా అని ఇదేదో గట్టిగా పోరాడి ఓడిన రాజకీయ యుద్ధం కాదు. చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిన సందర్భం. 2019లో ఏపీ ప్రజలు బాబుకు బై చెబితే.. ఈసారి కుప్పం ప్రజలు ఏకంగా చంద్రబాబు రాజకీయ జీవితానికే గుడ్ బై చెప్పారు. ఈ ఎన్నికతో “బైబై బాబు ఎపిసోడ్”కు ఓ సంపూర్ణత చేకూరింది.
మొన్నటివరకు లోకేష్.. ఇప్పుడు బాబు కూడా!
2014 ఎన్నికల్లో లోకేష్ ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారనే చర్చ మొన్నటివరకు ఉండేది. తను మంగళగిరి నుంచే మరోసారి బరిలోకి దిగుతానని లోకేష్ ఆమధ్య స్వయంగా ప్రకటించుకున్నారు కూడా. ఇప్పుడు చంద్రబాబు కూడా తన నియోజకవర్గంపై స్వీయప్రకటన ఇచ్చుకునే దుస్థితి ఏర్పడింది. ఆయన మరో నియోజకవర్గం వెదుక్కుంటారా లేక ఇప్పట్నుంచి కష్టపడి కుప్పంలోనే తన పట్టు నిలుపుకుంటారా అనేది ప్రధాన ప్రశ్నగా నిలిచింది.
నిజానికి కుప్పంలో చంద్రబాబు తన పట్టుకోల్పోవడానికి ఆయన స్వీయ తప్పిదాలు మాత్రమే కారణం కాదు, వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్ని దీనికి అది పెద్ద కారణంగా చెప్పుకోవాలి. చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కుప్పంను ఒకేలా చూశారు. పండక్కి వెళ్లి ఫొటోలు దిగడమే తప్ప పేదల సంక్షేమం ఆయనకు ఎప్పుడూ పట్టలేదు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అంటే ఏంటో చూపించింది. పేద ప్రజల్ని రాజుల్ని చేసింది. మరీ ముఖ్యంగా రెండున్నరేళ్లుగా కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించింది. సంక్షేమ ఫలాల్ని కుప్పం నియోజకవర్గ ప్రజలకు అందిస్తూనే, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. దీనికితోడు కరోనా టైమ్ లో కుప్పం సెగ్మెంట్ లో వైసీపీ శ్రేణులు చేసిన సహాయక చర్యలు, అందించిన చేయూతను ప్రజలు మరిచిపోలేదు. ఇవన్నీ కలిసి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు హవాను తగ్గించాయి.
ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలి. ఈవీఎంలు టాంపరింగ్ చేశారంటూ గతంలో, దొంగ ఓట్లు వేశారంటూ ఇప్పుడు ఆయన తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవచ్చు. ప్రజల్ని మభ్యపెట్టవచ్చు. ఎల్లో మీడియాలో హెడ్ లైన్స్ వేయించుకోవచ్చు. కానీ ఈ క్రమంలో బాబు తననుతాను మోసం చేసుకుంటున్నాననే విషయాన్ని గ్రహించాలి.
బైబై బాబు అయిపోయింది, గుడ్ బై బాబు కూడా ఈరోజుతో పూర్తయింది. ఇక చంద్రబాబు ప్రత్యేకంగా రాజకీయ జీవితానికి రిటైర్మెంట్ ఇవ్వనక్కర్లేదు. ఆ కార్యాన్ని ప్రజలే పూర్తిచేశారు. రాజకీయ విరమణ శుభాకాంక్షలు చంద్రబాబూ!