విధి ఆడిన వింత నాటకం అనే పదబంధాన్ని కొంచెం మార్చి, “టమాట ఆడిన వింత నాటకం” అని చెప్పుకోవాలేమో. అంతలా రైతులతో ఆడుకుంటోంది టామాట. మొన్నటికిమొన్న కిలో 300 రూపాయలు పలికిన టమాట రేటు ఇప్పుడు అమాంతం కిలో 30 పైసలకు పడిపోయింది. మీరు విన్నది నిజమే. 30 రూపాయలు కూడా కాదు, అక్షరాలా 30 పైసలు.
ప్రస్తుతం కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో కిలో టమాట ధర 30 పైసలు పలుకుతోంది. టన్నుల కొద్దీ టమాట డబ్బాలు అమ్మినా కూడా రవాణా ఖర్చులు కూడా రావు. దీంతో చేసేదేం లేక రోడ్డు పక్కన టమాటాల్ని పడేస్తున్నారు రైతులు. మొన్నటివరకు అమృతంగా కనిపించిన టమాట, ఇప్పుడు వృధాగా పడి ఉంది. పశువులకు మేతగా మారింది.
2-3 నెలల కిందట వరకు టమాట విన్యాసాల్ని కథలు కథలుగా చెప్పుకున్నాం. దేశవ్యాప్తంగా ఎంతోమంది రైతులు లక్షాధికారులయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో రైతులు కోట్ల రూపాయలు కళ్లజూశారు. ఈ 100 రోజుల్లో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. టమాట ధరలు దారుణంగా పడిపోయాయి.
టమాటా పంటకు ప్రసిద్ధిగాంచిన చిత్తూరు జిల్లా మదనపల్లెలో కూడా టమాట ధర దారుణంగా పడిపోయింది. కిలో టమాట 3 రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్ లో కిలో టమాట ధర 25 రూపాయల నుంచి 30 రూపాయల మధ్య నడుస్తోంది.
మొన్నటివరకు టమాటతో లాభాలు చూసిన రైతులు, ప్రస్తుతం లబోదిబోమంటున్నారు. తమకు లక్షల్లో నష్టం వచ్చిందని వాపోతున్నారు. అంతా 'టమాట ఆట'.