తమ హోటల్ కు ఓ సౌండ్ పార్టీ వస్తే, ఆ హోటల్ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. అతడికి సకల సౌకర్యాలు, సేవలు అందిస్తారు. చివర్లో లక్షల్లో బిల్లు చేతిలో పెడతారు. ప్రతిచోట ఇది జరిగేదే. ఢిల్లీలో కూడా ఇలాంటిదే జరిగింది. అరబ్ షేక్ అని హోటల్ యాజమాన్యం భ్రమపడింది. కానీ అతడు ఓ దొంగ.
మహమ్మద్ షరీఫ్.. తనను తాను యూఏఈ రాజకుటుంబానికి చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. ఢిల్లీలోని ది లీలా ప్యాలెస్ అనే ఐదు నక్షత్రాల హోటల్ లో దిగాడు. అతడి దర్జా చూసి హోటల్ సిబ్బంది నిజంగానే అతడు షేక్ అని నమ్మారు.
అలా ఆగస్ట్ 1న హోటల్ లోని రూమ్ నంబర్-427లో అడుగుపెట్టిన షరీఫ్.. ఏకంగా 4 నెలల పాటు అదే హోటల్, అదే రూమ్ లో తిష్టవేశాడు. మధ్యమధ్యలో అడపాదడపా డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ, పెండింగ్ ఎమౌంట్ మాత్రం అలానే ఉంచాడు.
ఓ మంచి రోజు చూశాడు, హోటల్ లో ఉన్న ఖరీదైన సామగ్రితో ఉడాయించాడు. తెల్లారి లేచి చూస్తే షరీఫ్ లేడు. అతడి గదిలో ఖరీదైన సామగ్రి లేదు. ఆ సామగ్రితో పాటు అతడి హోటల్ బిల్లు విలువ 23 లక్షల 46వేల రూపాయలైంది.
తాము మోసపోయామని గ్రహించిన హోటల్ సిబ్బంది వెంటనే పోలీసుల్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు, కర్నాటకలోని పుత్తూరులో షరీఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది.
తననుతాను “ఆఫీస్ ఆఫ్ హిజ్ హైనెస్ షేక్ ఫలాహ్ బిన్ అల్ నహ్యాద్” కు ముఖ్యకార్యదర్శిగా పరిచయం చేసుకున్న షరీఫ్.. హోటల్ సిబ్బందికి నకిలీ యూఏఈ ప్రభుత్వ గుర్తింపు కార్డును అందించాడు. దీనికి సంబంధించి కూడా అతడిపై కేసు నమోదైంది.