మొక్కు ఉంటే ఏదో నాటికి చెల్లించక తప్పదు. లేకపోతే అది మనసుని కలచివేస్తుంది. ఇది ఆస్తిక జనులు నమ్మే కఠిన సత్యం. అందుకే అమరావతి నుంచి అరసవెల్లికి పాదయాత్ర చేయాలని రైతులు అంతా అనుకున్నా అది సాధ్యపడక మధ్యలో నిలిపేసినా ఒక్కడు మాత్రం నడుము కట్టి మొక్కు అయిందనిపించారు. అలా అరసవెల్లి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేశారు.
ఆ ఒక్కరే అమరావతి రాజధాని కమిటీ నేత గద్దె తిరుపతిరావు. ఆయన సైలెంట్ గానే ఈ పాదయాత్ర చేసుకొచ్చారు. ఆయనకు తెలుగుదేశం నాయకులు సహకరించారు. వారే దగ్గరుండి మరీ అరసవెల్లిలో స్వాగతం పలికి దర్శనం చేయించారు.
మొక్కు ఇస్తామని చెప్పి తప్పుకోవడం భావ్యం కాదు కనుక తానే ఒంటరిగా వచ్చానని గద్దె చెబుతున్నారు. ఈ నెల 11న రామచంద్రాపురం నుంచి ఆయన పాదయాత్ర చాలా సైలెంట్ గా స్టార్ట్ అయింది. ఆయన వెంట తెలుగుదేశం నేతలు అడుగడుగునా ఉంటూ అడుగులు వేశారు. అలా ఈ పాదయాత్ర తెలుగుదేశం పార్టీ స్పాన్సర్డ్ యాత్ర గానే సాగింది.
వైసీపీ ముందే ఆరోపించినట్లుగానే ఇది జరిగింది. గద్దె శ్రీకాకుళంలో మీడియా ముందు జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం వెనక తెలుగుదేశం ఉంది అంటున్నారు. జగన్ ఇల్లు కట్టుకున్నారు కాబట్టి అమరావతినే రాజధానిగా అంగీకరించినట్లు అని గద్దె కొత్త పాయింట్ తీసుకొచ్చారు. దానికి వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా తాము ఎన్నడూ కాదు అనలేదుగా అని వారు అంటున్నారు. అక్కడ శాసనరాజధాని ఉంటుంది. అది చాలదు మొత్తం మాకే కావాలి అనుకుంటేనే ఇబ్బంది అని వారు అంటున్నారు.
అమరావతి రాజధాని మొత్తం రాష్ట్రానికే తప్ప అమరావతి రైతుల కోసం కాదు అన్నట్లుగా ఆయన మాట్లాడారు, మొదట్లో ఏపీ జనాలు అదే నమ్మారు, కానీ ఆ విధంగా చేసింది కలరింగ్ ఇచ్చింది గత తెలుగుదేశం ప్రభుత్వం అని గద్దే మరచిపోవడమే కాదు వారితోనే చెట్టాపట్టాల్ వేసుకుని అమరావతి అందరి రాజధాని అని నమ్మమంటున్నారు.
ఇప్పటికే దాని మీద ఏపీలోని మూడు ప్రాంతాల జనాలలో ఒక కచ్చితమైన అభిప్రాయం ఉంది. అది ఎవరేమి చెప్పినా మారేది కాదు అంటున్నారు. అయితే మూడు రాజధానులా అమరావతి ఒక్కటేనా అన్నది అత్యున్నత న్యాయస్థానంలో విచారణ దశలో ఉంది కాబట్టి ఏమి తీర్పు వస్తుంది అన్నది అంతా ఎదురు చూడాల్సిందే.