లోకేశ్‌ను న‌డిపించే బాధ్య‌త ఆ రెడ్డి గారిదే!

ఎట్ట‌కేల‌కు లోకేశ్ పాద‌యాత్ర‌కు ముహూర్తం ఖ‌రారైంది. ఇక అడుగులు వేయ‌డమే త‌రువాయి. ఏ ప‌ని చేసినా టీడీపీ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ప‌క‌డ్బందీగా చేసే సంగ‌తి తెలిసిందే. ఈ నెల 27న మ‌ధ్యాహ్నం 12.03 గంట‌ల‌కు…

ఎట్ట‌కేల‌కు లోకేశ్ పాద‌యాత్ర‌కు ముహూర్తం ఖ‌రారైంది. ఇక అడుగులు వేయ‌డమే త‌రువాయి. ఏ ప‌ని చేసినా టీడీపీ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ప‌క‌డ్బందీగా చేసే సంగ‌తి తెలిసిందే. ఈ నెల 27న మ‌ధ్యాహ్నం 12.03 గంట‌ల‌కు మొద‌ల‌య్యే లోకేశ్ పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేసేందుకు టీడీపీ అధిష్టానం ప‌ని విభ‌జ‌న చేసింది. ఎవ‌రేం చేయాలో ఇప్ప‌టికే నిర్ణ‌యించారు. అయితే వీట‌న్నింటిని ప‌ర్య‌వేక్షించే బాధ్య‌త ఓ వ్య‌క్తికి అప్ప‌గించారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే లోకేశ్‌ను ముందుకు న‌డిపించే బాధ్య‌త‌ను జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అల్లుడు, ఎమ్మెల్సీ దీప‌క్‌రెడ్డికి టీడీపీ అప్ప‌గించ‌డం విశేషం.

ఇటీవ‌ల కాలంలో రెడ్ల‌కు టీడీపీ విశేష ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై వివిధ కార‌ణాల‌తో సొంత సామాజిక వ‌ర్గం వ్య‌తిరేకంగా వుంద‌నే ప్ర‌చారం సాగుతోంది. దీంతో వారిని మంచి చేసుకుంటే , ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లో రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం వుంటుంద‌ని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో కీల‌కమైన టీడీపీ సోష‌ల్ మీడియా బాధ్య‌త‌ల్ని టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి జీవీరెడ్డికి అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా టీడీపీ భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యించే లోకేశ్ పాద‌యాత్ర బాధ్య‌త‌ల్ని కూడా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన దీప‌క్‌రెడ్డికి అప్ప‌గించ‌డంపై పాల‌క‌, ప్ర‌తిప‌క్ష పార్టీల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. పాద‌యాత్ర ఎలా సాగాలో దీప‌క్‌రెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తుంటారు. పాద‌యాత్ర‌లో లోకేశ్‌తో ఎవ‌రెవ‌రిని క‌ల‌పాలో సంబంధిత నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌, స్థానిక టీడీపీ నేత‌లు నిర్ణ‌యించాల్సి వుంటుంది.

వారితో దీప‌క్‌రెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌న్వ‌యం చేసుకుంటూ, రాజ‌కీయంగా , ఇత‌ర‌త్రా అసంతృప్తుల‌కు చోటు లేకుండా ముందుకు న‌డిపించాల్సి వుంటుంది. లోకేశ్‌తో పాటు దీప‌క్‌రెడ్డి వెంట వుండాల్సిన ప‌రిస్థితి. లోకేశ్ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కీల‌క పాత్ర పోషించ‌నుండ‌డం ఆస‌క్తిక‌రం.