యువగళం పేరుతో నారా లోకేశ్ కుప్పం నుంచి మొదలు పెట్టనున్న పాదయాత్ర టీడీపీలో ఉద్వేగాన్ని నింపుతోంది. లోకేశ్ పాదయాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా టీడీపీ తీసుకుంది. జగన్ పాదయాత్రను తలదన్నేలా నిర్వహించాలనే పట్టుదలతో టీడీపీ వుంది. ఈ నేపథ్యంలో పాదయాత్ర సాగే విధానం గురించి తెలుసుకుందాం.
ఈ నెల 27న కుప్పంలో సరిగ్గా 12.03 గంటలకు శుభ ముహూర్తాన పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ పాదయాత్రలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, పొలిట్‌బ్యూరో సభ్యులు, అధికార ప్రతినిధులు వేదికపై ఆసీనులు కానున్నారు. సుమారు 300 మందితో సభా వేదిక ఉండనుంది.
ప్రతిరోజూ పాదయాత్ర ఉదయం 8 గంటలకు మొదలై 11 వరకూ సాగుతుంది. ఆ తర్వాత స్థానిక టీడీపీ నేతలతో భేటీ అవుతారు. పార్టీలో నెలకున్న సమస్యలపై చర్చించి పరిష్కరిస్తారు. మధ్యాహ్నం స్థానిక నేతలతో కలిసి లంచ్ చేస్తారు. నాలుగు గంటల వరకూ నేతలతోనే గడుపుతారు. అనంతరం 4 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభమై 6.30- 7 గంటల వరకూ సాగుతుంది. అనంతరం టీడీపీ నేతలు, ఇతరత్రా ముఖ్యులతో సమావేశం అవుతారు. పాదయాత్ర సాగే నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి లోకేశ్ దిశా నిర్దేశం చేస్తారు. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల్ని మమేకం చేసేందుకు ప్రత్యేక యంత్రాంగం నిత్యం పని చేస్తూ వుంటుంది.