శ్రీకాకుళం జిల్లా అంటే వలసల జిల్లాగా పేరు. అదే ఇపుడు సలసల మరిగిస్తోంది. కరోనాను ఎగదోసి మరీ చిగురుటాకులా విలవిలలాడిస్తోంది. కరోనా వ్యాపిస్తున్న కొత్తలో జీరో కేసులు నమోదు అయిన ఈ జిల్లా లాక్ డౌన్ సడలింపుల తరువాత బాగా చిక్కుకుంది.
అది మొదలు రోజుకు రెండు మూడు వందల కేసులుగా పెరుగుతూ వచ్చాయి. ఇపుడు ఏకంగా రోజుకు వేయి దాకా కేసులు వస్తున్నాయి. దాంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు వెళ్లిన కార్మికులు ఇంటి ముఖం పట్టడంతో కేసులు పెరిగాయని ఒక అంచనా.
ఇక ఎంత కంట్రోల్ చేసినా ప్రతీ ఆదివారం లాక్ డౌన్ ప్రకటిస్తున్నా కూడా కేసులు కొలిక్కి రావడంలేదు, దానికి కారణం ప్రజలు బేఖాతరుగా రోడ్ల మీదకు వచ్చేయడం అంటున్నారు, అదే విధంగా సోషల్ డిస్టెన్స్ పాటించడంలేదు, కరోనా కారణంగా ఎందరో ప్రముఖ వ్యాపారులను, ప్రజా నేతలను ఈ జిల్లా ఇప్పటికే కోల్పోయింది.
నాలుగు దశాబ్దాలుగా శ్రీకాకుళం పట్టణ రాజకీయాలను శాసించిన మునిసిపాలిటీ మాజీ చైర్మన్ వరం కరోనా బారిన పడి తాజాగా అసువులు బాయడం వైసీపీ తీరని లోటుగా భావిస్తోంది. ఇవన్నీ చూసిన జిల్లా యంత్రాంగం కనీసం 45 రోజుల పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. ఇది పరీక్షాసమయం అని కూడా హెచ్చరిస్తోంది. అంటే అక్టోబర్ నెలాఖరు వరకూ సిక్కోలు కరోనా కోరల్లోనే ఉంటుందని అర్ధమట. చూడాలి మరి ఎపుడు కేసులు తగ్గుముఖం పడతాయో.