చెన్నమనేని రమేష్‌.. వాట్‌ నెక్స్‌ట్‌.?

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కి కేంద్ర హోం శాఖ పెద్ద షాకే ఇచ్చింది. ఆయనకు భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. దాంతో, చెన్నమనేని రమేష్‌ తన ఎమ్మెల్యే…

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కి కేంద్ర హోం శాఖ పెద్ద షాకే ఇచ్చింది. ఆయనకు భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. దాంతో, చెన్నమనేని రమేష్‌ తన ఎమ్మెల్యే పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిజానికి, చెన్నమనేని రమేష్‌పై పౌరసత్వానికి సంబంధించి గతంలోనే ఆరోపణలు వచ్చాయి. వ్యవహారం కోర్టుదాకా వెళ్ళింది. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ జరిగింది. కేంద్రమే ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాలు తేల్చి చెప్పాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ, చెన్నమనేని రమేష్‌ పౌరసత్వం వివాదంపై దృష్టిపెట్టింది. భారత పౌరసత్వ శాఖ విభాగం ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు సేకరించి, చెన్నమనేని రమేష్‌ భారత పౌరుడు కానే కాదని తేల్చి చెప్పింది. దేశంలో చెన్నమనేని రమేష్‌ ఎలాంటి అధికారాలూ పొందేందుకు వీల్లేదనీ పేర్కొంది కేంద్ర హోం శాఖ.

అయితే, తాజాగా కేంద్ర హోం శాఖ చెన్నమనేనికి భారత పౌరసత్వం రద్దు చేయడం, అక్రమ మార్గాల్లో భారత పౌరసత్వాన్ని పొందారని కేంద్ర హోంశాఖ నిర్ధారించడంతో 'వాట్‌ నెక్స్‌ట్‌' అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. చెన్నమనేని రమేష్‌ మాత్రం, తాను న్యాయపోరాటం కొనసాగిస్తానని అంటున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెన్నమనేని రమేష్‌కి టిక్కెట్‌ ఇవ్వొద్దనీ, ఆయన పౌరసత్వంపై వివాదాలున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలే అభ్యంతరాలు పెట్టినా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆ వాదనల్ని పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తమ్మీద, పౌరసత్వం రద్దు వ్యవహారంపై చెన్నమనేని న్యాయపోరాటం ఫలిస్తుందా.? ముఖ్యమంత్రి పదవిని ఆయన వదులుకోవాల్సిందేనా.? వేచి చూడాల్సిందే.