అదేంటో గానీ మామ కరోనా బారిన పడితే అల్లుడి నోట మతిలేని మాటలు వస్తున్నాయి. ఇదేనేమో కరోనా కాలమంటే. అసలు విషయానికి వద్దాం. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇటీవల కడప కేంద్ర కారాగారంలో కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనంతపురం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ట్రీట్‌మెంట్ కోసం ఆయన్ని హైదరాబాద్ తరలించిన విషయం కూడా అందరికీ తెలిసిందే.
జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడే ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి. వ్యాపారవేత్త అయిన ఆయన టీడీపీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత రాజకీయాల్లో చాలా యాక్టీవ్ అయ్యారు. ఇటీవల టీవీ బిబేట్లకు వెళుతూ నిత్యం మీడియాలో కనిపిస్తూ ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. దీపక్‌రెడ్డి మామ గార్లైన జేసీ బ్రదర్స్ నోటి దురుసు ఇటీవల బాగా తగ్గింది. దీంతో మామగారి నోళ్లు తెరవని నేపథ్యంలో రాజకీయంలో ఏర్పడిన శూన్యతను అల్లుడు దీపక్‌రెడ్డి పూడ్చాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్టున్నారు.
తాజాగా ఆయన చేసిన దాన్ని తెలియజేస్తోంది. జగన్ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే రీకాల్ బిల్లు పెట్టాలని దీపక్‌రెడ్డి సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలు తేలుస్తారని, ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ప్రజలకు తెలుస్తుందన్నారు. అదేంటో జగన్ పాలన స్టార్ట్ చేసి 15 నెలలకే దీపక్‌రెడ్డి భరించలేకున్నారు. మరీ అంత ఓపిక లేకపోతే ఎలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి 23 సీట్లకే పరిమితమైన టీడీపీ…గత ఐదేళ్లలో ఏనాడైనా రీకాల్ బిల్లు పెట్టాలని ఎందుకో తోచలేదో దీపక్ చెప్పగలరా?
మీ కథ చూస్తాం.. మీ సంగతి తేలుస్తామనేవారు రావాలని, ఎవరి దమ్ము ఏంటో తేలాలంటే ఫ్రెండ్లీ బాక్సింగ్ మ్యాచ్ పెట్టుకుందామని ఆయన ఆహ్వానం పలకడం మరీ విడ్డూరంగా ఉందంటున్నారు.
‘దమ్మున్న వైసీపీ నాయకుడెవడో పేరు ఇవ్వమనండి. బూతులు తిట్టడంలో అయినా పోటీ పెట్టుకుందాం. వైసీపీ నుంచి ఎవరు వస్తారో రండి. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రప్రగతిని చూసి దేశం నవ్వుతోంది. అప్పులు తేవడంలో 1వ స్థానం, కరోనా వ్యాప్తిలో 2వ స్థానం.. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ప్రత్యేక హోదాపై పోరాటం అంటూ కేంద్రం బిల్లులకు మద్దతిస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అని.. భవిష్యత్‌లో రేప్‌లు, మర్డర్లు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు’ అని దీపక్‌రెడ్డి ఘాటు కామెంట్ చేశారు.
ఏంటో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టే….ప్రస్తుత ప్రభుత్వం చేయాలని దీపక్‌రెడ్డి ఆశిస్తున్నట్టున్నారు. బూతులు తిట్టడంలో పోటీ ఏంటి? వైసీపీ నాయకులు రావడం ఏంటి?…అసలు ఇలాంటివి మతి ఉన్నవాళ్లు మాట్లాడే మాటలేనా? అనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి టీడీపీ పాలనలో అన్ని అద్భుతాలు చేసి ఉంటే…ప్రజలు ఎందుకని 23 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లకే పరిమితం చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి…జగన్ సర్కార్‌పై ఓర్వలేని మాటలు…అతని నోట పిచ్చి ప్రేలాపనలు చేయిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అవాకులు చెవాకులు పేలుతూ ప్రజల్లో అభాసుపాలైన మామ గార్ల నుంచి గుణపాఠం నేర్వాల్సిన దీపక్‌రెడ్డి….ఎంతో రాజకీయ భవిష్యత్‌ను చేజేతులారా నాశనం చేసుకునేలా నోటికి పని చెబుతున్నారనే విమర్శలు లేకపోలేదు.