ఏపీలో ఈరోజు రిజల్ట్స్ డే. నెల్లూరు కార్పొరేషన్ తో పాటు, 12 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదల కాబోతున్నాయి. అయితే అందరి దృష్టి మాత్రం కుప్పంపైనే ఉంది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీ కావడం, దీనిపై వైసీపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో కుప్పం రిజల్ట్ పై అందరి కన్ను పడింది. కొద్దిసేపటి కిందట కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది.
కుప్పంలో నామినేషన్ల దశ నుంచే టీడీపీ-వైసీపీ మధ్య వార్ మొదలైంది. ఎలాగైనా కుప్పం మున్సిపాలిటీని దక్కించుకోవాలనే కసితో చంద్రబాబు పనిచేశారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి ఓ స్థానిక సంస్థ ఎన్నిక కోసం కుప్పంలో వాలిపోయారు. ప్రత్యేకంగా ప్రచారం చేశారు. ప్రజలకు వంగి దండాలు పెట్టారు. తన మనుషుల్ని రంగంలోకి దించారు. అంతేకాదు, ఆఖరి నిమిషంలో ఏదైనా జరగొచ్చనే అనుమానంతో ఎక్స్-అఫీషియో సభ్యుడిగా తన పేరును కూడా నమోదు చేసుకున్నారు.
అటు వైసీపీ కూడా కుప్పంను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుప్పం మున్సిపాలిటీని దక్కించుకొని, చంద్రబాబును నైతికంగా దెబ్బకొట్టాలనేది వైసీపీ ప్లాన్. ఇప్పటికే నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడుతోంది. ఇలాంటి టైమ్ లో కుప్పం మున్సిపాలిటీని కూడా టీడీపీకి దూరం చేసి, పూర్తి ఆధిపత్యం కనబరచాలని అనుకుంటోంది. ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి నేతృత్వంలో కుప్పంపై సర్వశక్తులు ఒడ్డింది ఆ పార్టీ.
ఈ క్రమంలో కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక సార్వత్రిక ఎన్నికల్ని తలపించింది. ప్రలోభాలు, డబ్బు, మద్యం పంపిణీ జోరుగా సాగింది. ఒక్కో ఓటుకు 10వేల రూపాయల వరకు చెల్లించినట్టు.. కుటుంబంలో ఐదుగురు ఓటర్లు ఉంటే వాషింగ్ మెషీన్, ఫ్రిడ్జ్, ఏసీ లాంటి నజరాలు అందించినట్టు కథనాలు వచ్చాయి. ఇక ఎన్నికలకు సరిగ్గా ఒక రోజు ముందు ఇతర ప్రాంతాలకు చెందిన ఓటర్లు కుప్పంలో అడుగుపెట్టారని, దొంగ ఓట్లు వేసేందుకు వాళ్లు వచ్చారంటూ విమర్శలు చెలరేగాయి. ఈ క్రమంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి.
మొత్తమ్మీద తీవ్ర ఉత్కంఠ మధ్య కుప్పంలో 76.49 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా 4వ వార్డులో 93 శాతం, అత్యల్పంగా 18వ వార్డులో 54శాతం పోలింగ్ నమోదైంది. సగటున ప్రతి వార్డులో 70శాతం పోలింగ్ నమోదైంది. దీంతో గెలుపు ఎటువైపు అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొన్ని వార్డుల్లో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజారిటీ (అనధికారికంగా) కనిపించినప్పటికీ.. మరికొన్ని వార్డుల్లో వైసీపీకి కూడా అంతే స్పష్టమైన మెజారిటీ కనిపించడం ఉత్కంఠను పెంచింది.
కుప్పంలోని జూనియర్ కళాశాలలో కొద్దిసేపటి కిందట కౌంటింగ్ మొదలైంది. 2 కౌంటింగ్ హాల్స్ లో 14 టేబుల్స్ ఏర్పాటుచేసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. మొత్తం 4 రౌండ్లలో, రౌండ్ కు 6 వార్డుల చొప్పున ఫలితాల్ని వెల్లడించబోతున్నారు. 14వ వార్డు మాత్రమే వైసీపీకి ఏకగ్రీవం అయింది. మిగతా 24 వార్డుల ఫలితాలు మరికొద్దిసేపట్లో రాబోతున్నాయి.
కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ గెలిస్తే, చంద్రబాబు రాజకీయ పతనం పరిపూర్ణయైనట్టు లెక్క. ఇక ఆయన కుప్పంను మరిచిపోవాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి మరో కొత్త నియోజకవర్గం వెదుక్కోవాలి.