దళితుల అణచివేత నేపథ్యంలో చాలా సినిమా వచాయి, వస్తూనే ఉన్నాయి. అయితే వీటిల్లో ఎన్ని అగ్రకులాల వారి మనసుల్ని తడుతున్నాయి అనేది ప్రశ్నించుకోవాలి.
ఎందుకంటే ఈ సినిమాల అంతిమ లక్ష్యం దళితుడు మీసం తిప్పి తొడ గొట్టడం కాదు. ఏ అగ్రకులాల అణచివేతకి దళితులు గురౌతున్నారో ఆ అగ్రకులాల వారి మనసుల్ని కరిగించడం, వారిలో దళితులపట్ల ప్రేమానుబంధాన్ని ఏర్పరచడం.
పా రంజిత్ తీసిన కబాలి, కాలా దళిత నేపథ్యానికి చెందినవే. కానీ అందులో దళితుడు సూపర్ స్టార్. అతను ఫైట్స్ చేస్తాడు, పంచ్ డయలాగ్స్ కొడతాడు. అగ్రకుల విలన్లు అతనికి బెదిరిపోతారు. ఇలాంటి సినిమాలు కొందరు దళితుల్ని ఉత్తేజపరుస్తాయేమో గానీ మిగిలిన కులాల వారిని కదిలించవు.
అలాగే “పలాస” వచ్చింది. అది కూడా అంతే. నిమ్నకులాల తిరుగుబాటు ఉంటుంది.
“శ్రీదేవీ సోడా సెంటర్” వచ్చింది. అదీ అంతే. హీరోయిజంతో కూడుకున్న కులవాదం.
“భైరవగీత” అనే సినిమా ఒకటొచ్చింది. అందులో కూడా ఇదే ధోరణి. నిమ్నకులానికి చెందిన హీరో అగ్రకులానికి చెందిన విలన్ కి నాలుక మడిచి వేలెత్తి వార్ణింగ్ ఇస్తాడు.
వీటివల్ల అగ్రకులాల గుండెలు కరగవు. పైగా ఆ కులాల వారికి, దళిత భావజాలానికి మరింత దూరం పెరుగుతుంది.
ఈ కోవలో “జై భీం” ఒక్కటీ గురిచూసి గుండెలమీద కొట్టింది. ఎందరో అగ్రకుల ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నట్టు చెప్పారు. ఇది చాలా అరుదుగా జరిగే విషయం. కారణం అందులో దళితుల తిరుగుబాటు లేదు. దీనంగా బాధని సహించడం, తర్వాత న్యాయపోరాటం చేయడం. సినిమా చూస్తున్న ఏ కుల ప్రేక్షకుడైనా దళిత పాత్రలవైపే ఉంటాడు. వాళ్లు గెలవాలనుకుంటాడు. వాళ్లని బాధపెట్టిన వాళ్లకి శిక్షపడాలనుకుంటాడు. అదీ ఈ సినిమాలు తీసే దర్శకులు చెయ్యాల్సిన పని.
మహాత్మా గాంధీ స్వాతంత్రం తెచ్చినా, జ్ఞానవేల్ తీసిన “జై భీం” సినిమాకి అంత పేరొచ్చినా కారణం ఒక్కటే. రెండింటిలోనూ హింసాత్మక తిరుగుబాటు లేదు. ఓర్పుతో చేసే న్యాయపోరాటమే ఉంది.
ఎంతటి కరడు కట్టిన సామ్రాజ్యాలనైనా, ఎంతటి మడికట్టుకుని కూర్చున్న కులాలనైనా కరిగించేది కరుణ రసం, అహింస.
– కరుణ దీన దయాళ్