మన వ్యవస్థ చెబుతున్నది ఏమిటంటే.. తెలుగు భాషను, మాతృభాషను కాపాడాల్సిన బాధ్యత పేద పిల్లలది. డబ్బున్న వాళ్ల పిల్లలు, పరపతి ఉన్న వాళ్ల పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లడం అనేది దశాబ్దాల నుంచి జరుగుతున్నదే! తెలుగునాట పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ల లో చాలా మంది ఇళ్లలో తెలుగు మాట్లాడుకోరు. తమ పిల్లలకు ఆంగ్ల భాష పరిజ్ఞానం రావడానికి ఆ తల్లిదండ్రులు కూడా ఇంగ్లిష్ నేర్చుకుని వారితో ఆ భాషలోనే మాట్లాడతారు.
సినిమా హీరోలు, రాజకీయ నేతల పిల్లలు ఇంగ్లిష్ పుట్టి, ఇంగ్లిష్ లో పెరుగుతారు. విదేశాలకు వెళ్లి చదువుతారు. ఆ తర్వాత తమ అవసరం మేరకు తెలుగునుక నేర్చుకుంటే నేర్చుకుంటారు లేదంటే లేదు!
ఇక ఇప్పటికే ఒక తరంలో ఐటీ ఉద్యోగాలను సంపాదించుకున్న వారి పిల్లల పరిస్థితీ అంతే! వారు చదివేది ఏ ఇంగ్లిష్ మీడియంలోనో.. ఆ తల్లిదండ్రులు ఆఫీసుల్లో ఇంగ్లిష్ లో కమ్యూనికేషన్ ను అలవాటు చేసుకుని తమ పిల్లలతోనూ అలాగే కమ్యూనికేట్ అవుతారు. ఇంగ్లిష్ రావడం వల్లనే తాము మంచి ఉద్యోగాలు పొందగలిగాం కాబట్టి తమ పిల్లలకూ అదే భాషను బాగా నేర్పడానికి వారు పుస్తకాలను కొనిస్తారు, కథల పుస్తకాలతో మొదలుపెట్టి.. వారి కమ్యూనికేషన్ ను బాగా డెవలప్ చేస్తారు!
ఇలా సమాజంలో రెండు వర్గాల వాళ్ల పిల్లలు ఇంగ్లిష్ ను జీవనాధారం కోసం, జీవితంలో భాగం చేసుకుంటారు. ఇది ఎవరికీ తెలియనిది ఏమీ కాదు!
ఇక గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న మధ్యతరగతి కుటుంబాల వాళ్ల పిల్లలు.. వీళ్లు ఎంత కష్టానికి ఓర్చి అయినా పిల్లలను బాగా చదివించుకుంటారు. తాము తింటారో, త్యాగమే చేస్తారో.. ఫీజులు కట్టి పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించుకుంటారు. పల్లెల్లో వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు కూడా పిల్లలను టౌన్లలో హాస్టల్స్ లో వదిలి ఇంగ్లిష్ మీడియంలో చదివించుకుంటారు. పట్టణాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వాళ్ల పిల్లలూ ఆంగ్ల మాధ్యమం పాఠశాలలకే వెళ్తారు.
ఇక ప్రభుత్వ పాఠశాలలకు ప్రస్తుతం వెళ్తున్నది ఎవరు? అంటే.. గ్రామాల్లో పూట గడవానికి కష్టపడే వాళ్ల పిల్లలు. పూట గడిచే తాహతు కలిగిన వాళ్లంతా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపి ఇంగ్లిష్ మీడియంలలో చదివించుకుంటారు. ఆ తాహతు లేని వాళ్లే గవర్నమెంట్ స్కూళ్లకు పంపుతున్నారు. వారికి కూడా ఇంగ్లిష్ మీడియంను అందుబాటులోకి తీసుకురావాలనేది ప్రభుత్వం ప్రయత్నం!
దీనిపై ప్రతిపక్షాలు, కొన్ని వ్యవస్థలు గగ్గోలు పెడుతున్నాయి! ఇంతకీ రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు, సినిమా హీరోలు, పత్రికాయాజమానులు, వీరికి వంత పాడుతున్న ఇతర మేధావులు, వ్యవస్థలు..చెబుతున్నది ఏమిటంటే.. తమ పిల్లలు ఎవరూ తెలుగు మీడియంలో చదవాల్సిన అవసరం లేదు, ఇంగ్లిష్ మీడియంలో పిల్లలను చదివించుకునే తాహతు ఉన్న వాళ్లూ తెలుగును రక్షించాల్సిన అవసరం లేదు.
పేదల పిల్లలు, దళితుల పిల్లలు, బీసీల పిల్లలు, పూటకు గడవడం కష్టంగా ఉన్న వారి పిల్లలుంటారే..వాళ్లు తెలుగు మీడియంలో చదవాలి. వారే తెలుగును రక్షించాలి. వారు ఇంగ్లిష్ మీడియంలో చదివారో.. అంతే తెలుగుకు అన్యాయం జరుగుతుంది, మాతృభాష కీర్తి మసక బారుతుంది! ఇదీ ఈ వ్యవస్థ ఇస్తున్న సందేశం! ఇదేమైనా న్యాయమా?