బుల్లితెరపై అతి పెద్ద వినోద కార్యక్రమానికి వేళైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్-4 స్టార్ మా ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌లో నేటి సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానుంది. ఈ రియాల్టీ వేసవిలో ప్రారంభమై ఎప్పుడో ముగించాల్సి ఉంది. అయితే అనూహ్యంగా కరోనా మహమ్మారి చుట్టుముట్టడంతో… ప్రాజెక్టులన్నీ తలకిందులైన విషయం తెలిసిందే.
అసలు ఈ దఫా బిగ్‌బాస్ రియాల్టీ షో ఉంటుందా, ఉండదా? అనే సవాలక్ష అనుమానాల మధ్య…ఎట్టకేలకు నేడు మన ముం దుకు వస్తోంది. 105 రోజుల పాటు కొనసాగే ఈ వినోద, వినూత్న కార్యక్రమంలో 16 మంది కంటెస్టెంట్లు పాల్గొననున్నారని సమాచారం. ఎప్పుడైతే తిరిగి బిగ్‌బాస్ సీజన్-4 ప్రారంభమవుతుందనే సమాచారం బయటికొచ్చిందో…అప్పటి నుంచి అందులో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించి పలువురు బుల్లితెర, వెండితెర సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. గాయని సునీత తదితర సెలబ్రిటీలు స్పందిస్తూ…తాము పాల్గొనడం లేదని, భవిష్యత్‌లో కూడా అలాంటి ఆలోచన లేదని తేల్చి చెప్పారు.
ప్రస్తుతానికి మనకు అందిన సమాచారం మేరకు విలేజ్ షో యూట్యూబర్‌గా పాపులారిటీ సంపాదించిన గంగవ్వ, మహాతల్లి ఫేమ్ జాహ్నవి, ఇద్దరు డైరెక్లర్లు సూర్యకిరణ్, అమ్మ రాజశేఖర్, నటులు లాస్య మంజునాథ్, దివి వైద్య, టీవీ9 న్యూస్ రీడర్ సత్య, యాంకర్ సుజాత, కమెడియన్ అవినాష్ తదితరులున్నారు.
కంటెస్టెంట్లు ఎవరనేది ఈ వేళ సాయంత్రం ఆరు గంటలకు హోస్ట్ నాగార్జున తెరదించనున్నారు. వెలుగు జిలుగుల మధ్య స్టార్ మాలో ఈ షో ప్రారంభం కానుంది. కోవిడ్ నిబంధనలన్నీ పక్కాగా పాటిస్తూ షూటింగ్ చేపట్టినట్టు తెలుస్తోంది. బిగ్‌బాస్ అనగానే గత ఎపిసోడ్‌లు కళ్ల ముందు మెదలకుండా ఉండవు.
ఈ ఎంటర్‌టైన్‌మెంట్ రియాల్టీ షోలో ఆటపాటలు, గొడవలు, రాద్ధాంతాలు, ప్రేమలు, సంథింగ్ సంథింగ్ ఇంకా అనేకానకేం ఉంటాయి. వారం వారం ఎలిమినేషన్లు, ఓటింగ్ ప్రక్రియ, టాస్క్‌లు ఓహ్…ఎన్నెన్ని భావోద్వేగాలో. ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా ఒక్కో వారం ఒక్కో రకంగా బిగ్‌బాస్ షోను రక్తి కట్టించేందుకు నిర్వాహకులకు కూడా ఓ పెద్ద టాస్కే అని చెప్పాలి.
ఎందుకంటే బుల్లితెరకు సంబంధించి రేటింగ్‌ను బట్టి ఎప్పటికప్పుడు బిగ్‌బాస్ నిర్వాహకులు స్ట్రాటజీ మార్చాల్సి ఉంటుంది. కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ టాస్క్‌లు ఇస్తే, బిగ్‌బాస్‌కు ప్రేక్షకులు ఏ రోజుకారోజు టాస్క్‌లు ఇవ్వడం ఇందులో ప్రత్యేకత. బిగ్‌బాస్ షో వీక్షణాన్ని బట్టి దాని రేటింగ్ ఆధారపడి ఉంటుంది. మిగిలిన షోలతో పోల్చితే రేటింగ్ సరిగా లేకపోతే….ప్రేక్షకుల్ని అలరించలేదని నిర్వాహకులు ఓ నిర్ణయానికి వస్తారు.
అప్పుడు దాన్ని రక్తి కట్టించేందుకు ఏం చేయాలనే అంశంపై ఆ షో నిర్వాహకులు కసరత్తు చేయడమే ప్రేక్షకులు ఇచ్చే టాస్క్‌గా భావించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా మూడు నెలలకు పైగా వినోద కార్యక్రమానికి స్టార్ మా నేటి నుంచి వేదిక కానుంది.