దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు డ్రగ్స్ సప్లయ్ చేసిన కుక్ ను, అతడి మేనేజర్ ను ఎన్సీబీ అరెస్టు చేసింది. తాము సుశాంత్ కు డ్రగ్స్ సప్లై చేసినట్టుగా వారు ఒప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి చనిపోయిన చాన్నాళ్లకు సుశాంత్ ను డ్రగ్స్ వినియోగించిన వ్యక్తిగా నిలబెట్టారు. సుశాంత్ మరణం అనుమానాస్పదం అంటూ, నటి రియా చక్రబర్తి అతడి మరణానికి కారణమంటూ సుశాంత్ కుటుంబం చేసిన ఫిర్యాదు మేరకు సాగుతున్న విచారణలో భాగంగా డ్రగ్స్ కోణం బయటపడింది.
సుశాంత్ కు డ్రగ్స్ సప్లయ్ చేశారంటూ కొంతమందిని అరెస్టు చేశారు. అంటే.. దాని అర్థం సుశాంత్ డ్రగ్స్ వినియోగించిన వ్యక్తి అని ఎన్సీబీ చెబుతున్నట్టే కదా, చనిపోయే నాటికి సుశాంత్ అంటే యువతలో చాలా క్రేజ్. ధోనీ బయోపిక్ హీరో, ప్రతిభావంతమైన నటుడిగా సుశాంత్ యువతలో ప్రత్యేక గుర్తింపుతో ఉండేవాడు. అనేక మంది పెద్దవాళ్లు కూడా ఈ యువనటుడి మరణం పట్ల చింతించారు. ఆ సినిమాలో అలా చేశాడు, ఈ సినిమాలో ఇలా ఆకట్టుకున్నాడంటూ సోషల్ మీడియాలో అనేక మంది కీర్తించారు. సుశాంత్ మరణాన్ని తట్టుకోలేక అక్కడక్కడ కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి.
అలా చాలా మందితో భావోద్వేగ పూరిత అనుబంధాన్ని ఏర్పరుచుకున్న ఆ దివంగత నటుడిని ఇప్పుడు డ్రగ్స్ వినియోగదారుగా నిలబెట్టారు. ఇక సుశాంత్ కు బలవంతంగా డ్రగ్స్ వాడేలా అలవాటు చేశారు అనేది మరో వాదన. సుశాంత్ లేడు కాబట్టి.. ఆ వాదన కొంతమందికి అతడిపై సానుభూతిని రేకెత్తించవచ్చు. కానీ, గత కొంతకాలంగా సుశాంత్ విషయంలో వస్తున్న వార్తలు మాత్రం కొంత విస్మయకరంగానే ఉంటున్నాయి.
ఈ కేసులో రియా ప్రమేయం గురించి మొదట్లో వచ్చిన ఆరోపణలకూ, ప్రస్తుత పరిస్థితికీ సంబంధం కనిపించడం లేదు. ఆమె అతడిని ఆర్థికంగా దోచుకుందనే తీవ్ర ఆరోపణ వచ్చింది. దానిపై ఇప్పుడు అలికిడి లేదు. రియా సోదరుడిని అరెస్టు చేశారు, అది డ్రగ్స్ కోణంలో, రేపోమాపో రియాను కూడా అరెస్టు చేస్తారని ఆమె తండ్రే అంటున్నాడు. దానికీ డ్రగ్స్ కోణమే కారణం అవుతుందేమో. తమది ఒక మధ్యతరగతి కుటుంబం అని, తమపై కక్ష సాధిస్తున్నారని రియా తండ్రి అంటున్నాడు.