నిజం చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి. అంతకు మించి సమాజంపై ప్రేమ, నిబద్ధత ఉన్న వాళ్లు తప్ప….ఎవరూ నిజాల్ని మాట్లాడ్డానికి సాహసించరు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో రాణించాలనుకునే వాళ్లు అసలు నిజాలు మాట్లాడరు. నిజాలకు, గ్లామర్ రంగానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా. ఈ విషయం బాగా తెలిసే….చాలా మంది చిత్ర పరిశ్రమ బాగోతాలపై నోరు మెదపరు.
బాలీవుడ్‌కు బాగా పరిచయమైన హీరోయిన్ శ్రేయ ధన్వంతరి అచ్చమైన తెలుగు అమ్మాయి. బాగా అల్లరి చేసే అమ్మాయిగా చెబుతారు. ఈమెది స్వస్థలం హైదరాబాద్. అయితే తండ్రి ఏవియేషన్‌లో ఉద్యోగం చేస్తుండడం వల్ల దేశవిదేశాలను ఆమె చుట్టేశారు. శ్రేయ 17వ ఏట కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది. వరంగల్‌లోని నిట్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారామె. భరత నాట్యం, కూచిపూడి, కథక్ నేర్చుకున్నారు. అంతటితో ఆగితే ప్రయోజనం లేదనుకుని, నటనపై ఇష్టాన్ని పెంచుకుని, బాలీవుడ్ కథానాయిక భూమి పడ్నేకర్ సలహాతో థియేటర్‌లోనూ శిక్షణ పొందారు.
ఆమెను మొట్ట మొదట టాలీవుడ్ గుర్తించి ‘స్నేహ గీతం’లో అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత తొమ్మిదేళ్లకు 2019లో బాలీవు డ్‌లో ఎంట్రీ దొరికింది. ఇమ్రాన్ హష్మీ పక్కన ‘వై చీట్ ఇండియా’ సినిమాతో గుర్తింపు పొందారు. అయితే ‘స్నేహ గీతం’, ‘వై చీట్ ఇండియా’ మధ్య కాలంలో ఆమె వెబ్ సంచలనంగా మారారు. ‘ది రీయూనియన్’ అనే సిరీస్‌లో ‘దేవాంశి టైలర్’ పాత్రతో అదరగొట్టారు. అలాగే ఆమె నటించిన మరో వెబ్ సిరీస్ ‘లేడీస్ రూమ్’.
శ్రేయలో ఇంకా అనేక కోణాలున్నాయి. ఆమెలో ఓ రచయిత్రి కూడా దాగి ఉంది. అన్యాయంపై నినదించే సామాజిక కార్యకర్తగా కూడా ఉంది. అన్నిటికీ మించి నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా మాట్లాడుతారనే పేరు సొంతం చేసుకున్నారు. తాజాగా ఆమె చెప్పిన ఓ అభిప్రాయం సంచలనమైంది.
‘ఎంత కష్టమైనా మీరెంచుకున్న దారి వదలకండి’ అంటూ అవార్డుల ఫంక్షన్స్‌లో స్టార్స్ చెప్పేదాంట్లో నిజం ఉండదనేది తన అభిప్రాయమని ఆమె కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఎందుకంటే సెలబ్రిటీలు చెప్పినంత ఈజీగా ప్రాక్టికాలిటీ ఉండదని ఆమె చెప్పుకొచ్చారు. వెండితెరపై తాను కనిపించడానికి తొమ్మిదేళ్ల పాటు పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. స్టార్స్ చెప్పేదాంట్లో నిజం ఉండదని ధైర్యం చెప్పడంతో పాటు అందుకు తన జీవితాన్నే ఉదాహరణగా చూపారామె. అందుకే శ్రేయ అంటే సంథింగ్ స్పెషల్.