ఆంధ్రజ్యోతి -ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ వారాంతపు ‘కొత్తపలుకు’… వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విషం చిమ్మేందుకు రాసే కాలమ్ అని అందరికీ తెలుసు. ఇప్పుడంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. పాలనలో తప్పు నిర్ణయాలను ఎత్తి చూపేందుకు ఓ అవకాశం. కానీ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ…ఆర్‌కే టార్గెట్ జగనే. ఆర్కే దృష్టిలో జగన్ ఓ రాక్షసుడు. ఎందుకో గానీ, ఈ వారం ఆర్కే కొత్త పలుకులో కొంచెం తేడా కనిపిస్తోంది.
సహజంగా ఆర్కే రాతలంటే మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు విషపు సిరాతో రాయడాన్ని చూశాం. కానీ ఈ వారం జగన్‌పై తిట్ల శాతమే ఎక్కువే అయినా …. ముఖ్యమంత్రికి సంబంధించి నాణేనికి రెండో వైపు కూడా ఆర్కే చూపడం ఆశ్చర్యంగా ఉంది.
ఈ వారం ‘రాజధర్మం ఏదీ.. ఎక్కడ?’ శీర్షికతో ఆర్కే కొత్త పలుకు వ్యాసం రాశారు. విషయం పాతదే. ఇదే కంటెంట్‌తో కొన్ని నెలల క్రితం, ఇంచుమించు ఇదే హెడ్డింగ్‌తో తాను ఆర్టికల్ రాసిన విషయాన్ని ఆర్కే మరిచిపోయినట్టున్నారు. ఆశ్చర్యం ఏంటంటే … జగన్‌పై విషం చిమ్మడానికి అలుపెరగని రాతలు రాస్తున్న ఆర్కే ఓపికను అభినందించాలి. ఈ శ్రమను జగన్‌పై కాకుండా తన మీడియా సంస్థపై పెట్టి ఉంటే…సంస్థ పురోభివృద్ధికి దోహద పడేదేమో! బహుశా తనను 23 సీట్లకు పరిమితం చేసిన జగన్‌పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా ఆర్కే అంత ద్వేషం ఉండదేమో!
ధర్మం, రాజధర్మం గురించి ఆర్కే రాస్తే…దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. ఎందుకంటే అధర్మానికి, అన్యాయానికి ప్రతీకైన మీడియా సంస్థ యజమాని ఆర్కే. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తున్నదో ఒకే ఒక్క ఉదాహరణ… ఆగస్టు 31న తీవ్ర అనారోగ్యంతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చనిపోయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1న ఆయన మరణానికి సంబంధించిన వార్తను అన్ని పత్రికల మాదిరిగానే ఆంధ్రజ్యోతిలో కూడా ప్రాధాన్యం ఇచ్చి ప్రచురించారు.
లోపలి పేజీలో ఆంధ్రాతో ప్రణబ్ అనుబంధం అంటూ ప్రత్యేక కథనం ఇచ్చారు. 2013లో ప్రణబ్ షార్‌ను సందర్శించిన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో , నాటి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తదితరులతో కలిసి దిగిన ఫొటో, అలాగే హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలుకుతున్న ఫొటోను క్యారీ చేశారు.
ప్రణబ్‌తో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేయకపోవడం ఏ జర్నలిజం విలువకు ప్రతీకనో ధర్మోపన్యాసాలు చేస్తున్న ఆర్కే సెలవిస్తే బాగుంటుంది. ఇంతకంటే దిగజారుడు, అధర్మం మరెక్కడైనా ఉంటుందా? ప‌్రణబ్‌తో జగన్ ఫొటో వేయకపోవడం వల్ల…ముఖ్యమంత్రికి పోయేదేమీ లేదు. కానీ ఆంధ్రజ్యోతి ఓ పత్రికగా తన విలువను తానే దిగజార్చుకుంటుందనే చెప్పడమే ఈ ప్రస్తావన ఉద్దేశం. ధర్మం, న్యాయం, నైతిక విలువల గురించి ఆర్కే పదేపదే చెబుతుండడం వల్లే…అవేవీ లేవని గుర్తు చేసేందుకే ఈ ఉదహరణ.
ఇక తాజా ఆర్కే ఆర్టికల్ విషయానికి వస్తే…ఎటూ జగన్‌పై లేనిపోని, అర్థంపర్థం లేని ఆరోపణలు, అబద్ధాలను పక్కన పెడితే ప్రశంసలకు కూడా కాస్త చోటు దక్కడం ఆశ్చర్యంగానూ, ఇదేదో ప్రపంచంలో 8వ వింతగానూ తోస్తోంది. జగన్ మాట వింటేనే భరించలేని ఆర్కే విషపు సిరా…సుగుణాలున్న మంచి మాటలు రాయడమా? అని నమ్మలేని పరిస్థితి. ఆ మంచి గురించి మాత్రమే రెండు మాటలు చెప్పుకుందాం.
‘తన తండ్రి రాజశేఖర్ రెడ్డిని మించి ఓట్లూ సీట్లూ సాధించి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కావాలన్నది ఆయనలో ఎప్పటి నుంచో ఉన్న కాంక్ష. అయితే ఆ పదవిని అందుకోవడానికి ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు. అవినీతి కేసులలో జైలుకు కూడా వెళ్లి వచ్చారు.
బెంగళూరు, హైదరాబాద్‌లో రాజసౌధాలను తలపించే లంకంత ఇళ్లు కట్టుకున్నప్పటికీ జగన్‌మోహన్ రెడ్డి వాటిలో పట్టుమని పది రోజులు కూడా ప్రశాంతంగా కంటినిండా నిద్రపోలేదు. సంవత్సరాల తరబడి జనంతో మమేకమై తిరిగారు. 2014లో ఓటమి ఎదురైనప్పటికీ కుంగిపోకుండా పాదయాత్ర పేరిట మళ్లీ జనంలో పడ్డారు. ఊహకు కూడా తట్టని వ్యూహాలతో చంద్రబాబును ఊహించని విధంగా దెబ్బకొట్టారు. దాదాపు పదేళ్ల నిరీక్షణ తర్వాత ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. అది కూడా ఆషామాషీగా కాదు. యాభై శాతం ఓట్లు సాధించడంతో పాటు, 151 సీట్లు గెలుచుకున్నారు’
ఆర్కే ఈ రాతల వెనుక ఉద్దేశం ఏమైనా కావచ్చు. కానీ జగన్‌లోని పోరాటత్వాన్ని, ఏళ్ల తరబడి ప్రజలతో మమేకం కావడాన్ని, ఓటమికి కుంగిపోని వ్యక్తిత్వాన్ని ఆర్కే అంగీకరించక తప్పలేదు. అసలు జగన్ బలమే అది. అలాగే ఇంతకాలం చంద్రబాబు అంటే పే…ద్ద వ్యూహకర్తగా ఇదే ఆర్కే, రామోజీ ఇంత కాలం క్రియోట్ చేస్తూ, సమాజాన్ని నమ్మిస్తూ వచ్చారు. కానీ బాబును తలదన్నేలా జగన్ వ్యూహాలు రచించడంలో దిట్ట అని ఆర్కే ఒప్పుకోవాల్సిన పరిస్థితి.
నిజం నిప్పులాంటిదని, దాన్ని దాస్తే దాగేది కాదని, ఏదో ఒక రోజు కాల్చుకుంటూ బయటికొస్తుందని చెప్పేందుకు ఆర్కే కలం నుంచి జాలువారిన ఈ మాటలే నిదర్శనం. అదే జగన్ గొప్పదనం. జగన్ విజయాన్ని కూడా ఆషామాషీ కాదని బద్ధశత్రువైన ఆర్కేతో రాయించడమే జగన్ సక్సెస్ రహస్యం.
‘జగన్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కసీ, పగతో రగిలిపోయారు. రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా తనను వ్యతిరేకిం చిన వారందరినీ టార్గెట్‌గా ఎంచుకున్నారు. తనను అన్యాయంగా జైలుకు పంపారని బలంగా నమ్ముతున్న జగన్‌మోహన్ రెడ్డి ఆ విషయాన్ని ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నారు. నాటి సంఘటనలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఉద్రేకానికి గురవుతున్నారట! ఈ క్రమంలోనే కమ్మ సామాజిక వర్గంపై ద్వేషం పెంచుకున్నారు’ … జగన్ ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నారనేందుకు ఆర్కే చెబుతున్న మాటలివి.
కానీ ఆర్కే కావచ్చు, జగన్‌పై ఇలాంటి ఆరోపణలు చేస్తున్న మరెవరైనా కావచ్చు…గుర్తించుకోవాల్సింది ఒక్కటుంది. అదేంటంటే…ధర్మోరక్షితి రక్షితః అని పెద్దలు ఊరికే చెప్పలేదు. ధర్మాన్ని మనం కాపాడితే, అది మనల్ని కాపాడుతుందని అర్థం. గతంలో జగన్ విషయంలో తామెలా ప్రవర్తించామో తమ అంతరాత్మలను ప్రశ్నించుకోవాలి.
జగన్ మానసికంగా కుంగిపోయేలా చేసి, రాజకీయంగా నామరూపాలు లేకుండా చేసేందుకు ఇటు టీడీపీ, కాంగ్రెస్, తదితర పార్టీలు, అటు ఆర్కే, రామోజీ తదితర ఒక సామాజికవర్గానికి చెందిన మీడియా అధిపతులు సాగించిన, సాగిస్తున్న వికృత క్రీడల గురించి ఎవరికి తెలియదు? ఒకవైపు జగన్‌పై ఇప్పటికీ విషం చిమ్ముతూ, మరోవైపు ఆయన రాజధర్మం పాటించడం లేదనడం ఏం సంస్కారమే ప్రశ్నిస్తున్న వాళ్లకే తెలియాలి.