ప్రభుత్వ పథకాలు సరే.. ప్రచారం పట్ల నిబద్ధత ఏదీ.?

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు ప్రకటితమవుతున్నాయి.. ఒక్కొక్కటిగా అమలుకు నోచుకుంటున్నాయి. Advertisement ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చే క్రమంలో ముందుగా సంక్షేమ పథకాలపై ఫోకస్‌ పెట్టింది వైఎస్‌…

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు ప్రకటితమవుతున్నాయి.. ఒక్కొక్కటిగా అమలుకు నోచుకుంటున్నాయి.

ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చే క్రమంలో ముందుగా సంక్షేమ పథకాలపై ఫోకస్‌ పెట్టింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. అమల్లోకి వస్తోన్న ఏ సంక్షేమ పథకం మీద కూడా విమర్శలకు ఆస్కారం లేని పరిస్థితి కన్పిస్తోంది. అయితే, ఆయా పథకాల గురించి ప్రచారం చేసుకోవడంలో మాత్రం అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విఫలమవుతోందనే చెప్పాలి.

ప్రచారం.. అంటే పత్రికల్లోనూ, టీవీల్లోనూ ప్రకటనలు ఇవ్వడం మాత్రమే కాదు.. అధికార పార్టీ నేతలు, వాటి గురించి సవివరంగా ప్రజలకు చెప్పడం కూడా.! అయితే, ఇతరత్రా రాజకీయ వివాదాల కారణంగా, సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రచారంపై అధికార పార్టీ నేతలు శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. 'పనులు చేస్తున్నాం.. కానీ, చెప్పుకోలేకపోతున్నాం..' అని వైసీపీ ముఖ్య నేతలు అధినేత వద్ద వాపోతున్నారు.

కొడాలి నాని వ్యవహారం కావొచ్చు, వల్లభనేని వంశీ వ్యవహారం కావొచ్చు, ఇసుక కొరత కావొచ్చు, ఇంగ్లీషు మీడియం వ్యవహారం కావొచ్చు.. ఇవన్నీ, సంక్షేమ పథకాల ద్వారా కలిగే సానుకూలతని డామినేట్‌ చేస్తున్నాయన్నది నిర్వివాదాంశం. రాజధాని అమరావతి విషయంలో బొత్స అత్యుత్సాహం, చంద్రబాబుని విమర్శించే క్రమంలో కొడాలి నాని వాడిన అసభ్య పదజాలం.. ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నాయి.

ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి పార్టీపై పూర్తి పట్టు వుండేది. దానర్థం, ఇప్పుడు లేదని కాదు. కానీ, అటు ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించిన విషయాల్ని ఎప్పటికప్పుడు చూసుకోవాలి.. అదే సమయంలో, పార్టీ వ్యవహారాల్ని చక్కదిద్దాలి.. అంటే అది కష్టసాధ్యమైన పనే. ఇక్కడే, పార్టీ సీనియర్‌ నేతలు.. పార్టీని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, విపక్షాల విమర్శలక చెక్‌ పెట్టడం చేయాల్సి వుంటుంది. కానీ, ఆ దిశగా 'బాధ్యత' తీసుకునే నాయకులు వైసీపీలో కన్పించడంలేదు.

అధినేత మెప్పు కోసం ఆరాటం తప్ప, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై కొందరు సీనియర్‌ మంత్రులు కూడా తగిన స్థాయిలో దృష్టిపెట్టకపోవడం ఇటు ప్రభుత్వానికీ, అటు పార్టీకీ చెడ్డపేరు తెచ్చిపెడ్తోంది.