వైఎస్ జగన్మోహనరెడ్డి తన పాదయాత్ర సమయంలోనే.. రాష్ట్రంలో మద్యనిషేధం తీసుకువస్తానని ఆడపడుచులకు, అక్కచెల్లెళ్లకు మాట ఇచ్చారు. దాదాపు సంపూర్ణ మద్యనిషేధాన్ని దశలవారీగా రాష్ట్రంలో కార్యరూపంలోకి తెస్తాం అని కూడా చెప్పారు. ఈ దిశగా మాత్రం.. జగన్ సర్కారు చాలా కృతనిశ్చయంతో పనిచేస్తోంది.
ఇప్పటికే మద్యం దుకాణాలను కుదించడం, బెల్టు షాపులను కట్టడి చేయడం, ప్రభుత్వం తరఫునే విక్రయాలు జరపడం, ధరలు పెంచడం వంటి నిర్ణయాలు తీసుకున్న జగన్ సర్కారు.. మంగళవారం నాడు మరో ప్రశంసార్హమైన నిర్ణయం తీసుకున్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బార్లను 40 శాతం వరకు కుదించడానికి ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 797 గా ఉన్న బార్ల సంఖ్య 479కి తగ్గుతుంది. ప్రస్తుతం బార్లకు ఉన్న లైసెన్సులను మొత్తం రద్దు చేస్తున్నారు.
బార్ల ఫీజులను లైసెన్సు రుసుములను భారీగా పెంచుతున్నారు. బార్లలో ఉదయం 11నుంచి సాగే విక్రయాలు రాత్రి 10వరకు మాత్రమే ఉండాలి. స్టార్ హోటళ్లలో మాత్రం రాత్రి 11 వరకు అనుమతిస్తారు. ఈ రకంగా బార్లలో మద్యం వినియోగాన్ని పలురకాలుగా నియంత్రిస్తున్నారు.
ఈ చర్యల వల్ల మద్యం వినియోగం భారీగా తగ్గే అవకాశం ఉంది. పైగా బార్లలో విక్రయించే మద్యం ధరలను కూడా పెంచుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ కొత్త బార్ల విధానం అమల్లోకి వస్తుంది. ఈ చర్యలన్నీ పటిష్టంగా అమలైతే గనుక.. రాష్ట్రంలో మద్యం వినియోగం కనీసం 20 శాతం వరకు తగ్గుతుందనేది ఒక అంచనా.
క్రమక్రమంగా సంపూర్ణ మద్యనిషేధం దిశగా వేసే అడుగుల్లో ఇవి కీలకంగా పేర్కొనవచ్చు. అలాగే.. నాటు సారీ తయారీ, మద్యం స్మగ్లింగ్, కల్తీలకు పాల్పడే వారికి కూడా.. నాన్ బెయిలబుల్ శిక్షలు పడేలా చట్టాలను సవరిస్తున్నారు.
మొత్తానికి సంపూర్ణ మద్య నిషేధం దిశగా.. సౌభాగ్యమైన రాష్ట్రాన్ని సృజించడానికి జగన్మోహనరెడ్డి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.