కమ్మరాజ్యంలో కడపరెడ్లు.. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ ట్రయిలర్ లోనే చాలా చూపించాడు వర్మ. మరీ ముఖ్యంగా చంద్రబాబు పాత్రతో కొడుక్కి పప్పు వడ్డించే సన్నివేశం టోటల్ ట్రయిలర్ కే హైలెట్ అయింది.
తాజాగా వర్మ రిలీజ్ చేసిన రెండో ట్రయిలర్ లో ఇలాంటి పంచ్ లు మరిన్ని ఉన్నాయి.
ఈలోగా పార్టీని ఆ “బుడ్డోడు” లాగేసుకుంటాడు
కొడుకు మీద ప్రేమతో పార్టీని సర్వనాశనం చేశాడు
కళ్లు పెద్దవి చేసి చూస్తే ఎవ్వరూ భయపడరు ఇక్కడ
ఇవి జస్ట్ కొన్ని మాత్రమే. ఇలాంటి పంచ్ లు చాలా పేల్చాడు వర్మ. మరీ ముఖ్యంగా ఈసారి ఎన్టీఆర్ ను కూడా తన ట్రయిలర్ లో ప్రస్తావించాడు. తారక్ ను కొంతమంది బుడ్డోడు అని కూడా అంటారు. అదే పదాన్ని నేరుగా ట్రయిలర్ లో ప్రస్తావించాడు వర్మ. చంద్రబాబు పార్టీని ఎన్టీఆర్ లాగేసుకుంటాడు అనే అర్థం వచ్చేలా డైలాగ్ పెట్టాడు.
దీంతో పాటు తొలి అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబుకు జగన్ ఇచ్చిన వార్నింగ్ ను కూడా తన సినిమాలో వాడేశాడు రామ్ గోపాల్ వర్మ.
మరోవైపు అచ్చెన్నాయుడు పాత్రతో కూడా ఆడుకున్నాడు. భారీకాయంతో ఉండే అచ్చెన్నాయుడు పాత్రధారి, బాబు పక్కన కూర్చొని వలవల ఏడుస్తున్న సీన్ టోటల్ ట్రయిలర్ కే హైలెట్ గా నిలిచింది.
ఇక పవన్ కల్యాణ్ సంగతి సరేసరి. ఆయన ట్రేడ్ మార్క్ డైలాగ్ తాటతీస్తా అనే పదాన్ని ట్రయిలర్ లో కూడా పెట్టేశాడు దర్శకుడు.
వీటితో పాటు తన పార్టీ మీద తానే సెటైర్లు వేసే లోకేష్ పాత్రను కూడా అదే స్టయిల్ లో చూపించి మరోసారి నవ్వులు పూయించాడు. అటు జగన్ మార్క్ డైలాగ్స్, మేనరిజమ్స్ కూడా ట్రయిలర్ లో చాలానే ఉన్నాయి.
మొత్తమ్మీద ఈసారి వర్మ మరింత ఘాటుగా ట్రయిలర్ ను కట్ చేశాడు. అయితే వర్మ సినిమాల్లో సరకు మొత్తం ట్రయిలర్ లోనే కనిపిస్తుంది. సినిమాలో అంతకుమించి ఇంకేం ఉండదు. ఈ విషయాన్ని అతడి గత సినిమాలు చాలానే ప్రూవ్ చేశాయి.
కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే ఈ సినిమా హైప్ కూడా ఇలా ట్రయిలర్స్ కే పరిమితం అంటున్నారు చాలామంది. ఈనెల 29న ఏ విషయం తేలిపోతుంది.