పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి.. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి దక్కాల్సినవి చాలానే వున్నాయి. ప్రత్యేక హోదా సహా చాలా అంశాలపై రాష్ట్రం, కేంద్రానికి ఇప్పటికే చాలాసార్లు మొరపెట్టుకుంది. చంద్రబాబు హయాంలో ఇదొక ప్రసహనంగా సాగింది. వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెబుతోంది. ఈ తరుణంలో, రాజకీయాల్ని పక్కన పెట్టి.. అన్ని రాజకీయ పార్టీలూ కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాలి.
కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్.. ప్రత్యేక హోదా సహా, విభజన హామీలపై గొంతు పెగల్చడంలేదు. సోషల్ మీడియాలో కనీసం ట్వీట్ కూడా కన్పించడంలేదు. ఇసుక వ్యవహారమ్మీదా, ఇంగ్లీషు మీడియం గురించీ.. ఇతరత్రా అంశాల గురించీ వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే బహుశా పవన్‌కి సమయం సరిపోవడంలేదేమో. వాటితోపాటు, ఒక్క ట్వీట్ అయినా రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రాన్ని ప్రశ్నిస్తూ పవన్ వేసి వుండాల్సింది. అది ఆయన బాధ్యత కూడా.
'ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలిచినా మేం ప్రజల పక్షాన వుంటాం..' అని చెబుతున్న పవన్ కళ్యాణ్, ఆ ప్రజల కోసం ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేయరా.? ఇటీవల ఢిల్లీకి వెళ్ళిన పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిశారా.? లేదా.? కలిస్తే, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడారా.? లేదా.? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో వున్నారు జనసేన నేతలు.
తెలుగు భాష విషయమై ఆర్టికల్ 350-ఎ గురించి ట్వీటేసిన పవన్ కళ్యాణ్, విభజన చట్టంలోని అంశాల గురించి ఎందుకు ట్వీట్ చేయలేదనే ప్రశ్న, సోషల్ మీడియా వేదికగా ఆయనే సూటిగా తగులుతోంది. 'ఎంపిక చేసుకున్న విషయాల మీద' తప్ప, ఇతరత్రా ఎలాంటి ప్రజా ప్రయోజనకరమైన విషయాల గురించీ పవన్ కళ్యాణ్ మాట్లాడరా.? అంటే, ఔననే చెప్పాలేమో.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయనగారి పుత్రరత్నం నారా లోకేష్ కూడా.. విభజన హామీల గురించి ఇప్పుడు పెదవి విప్పకపోవడం చర్చనీయాంశమవుతోంది.