ఆర్టీసీ సమ్మె విరమణ.. గాల్లో కలిసి “విలీనం”

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. 47 రోజులుగా సుదీర్ఘంగా సాగుతున్న సమ్మెకు ఇవాళ్టితో తెరపడింది. సమ్మెను విరమించబోతున్నట్టు ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. Advertisement కార్మికుల్ని భేషరతుగా విధుల్లోకి తీసుకుంటే, సమ్మెను విరమించుకోవడానికి…

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. 47 రోజులుగా సుదీర్ఘంగా సాగుతున్న సమ్మెకు ఇవాళ్టితో తెరపడింది. సమ్మెను విరమించబోతున్నట్టు ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు.

కార్మికుల్ని భేషరతుగా విధుల్లోకి తీసుకుంటే, సమ్మెను విరమించుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు యూనియన్ నాయకులు. ఈ విషయంలో కార్మికులకు ఎలాంటి షరతులు పెట్టకూడదని, అక్టోబర్ 4కు ముందు (సమ్మె ప్రారంభానికి ముందు) కార్మికులు ఎలా ఉండేవారో, అదే విధంగా వాళ్లను విధుల్లోకి తీసుకోవాలని, ఈ షరతుకు అంగీకరిస్తే, సమ్మెను విరమించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని యూనియన్ నేతలు స్పష్టంచేశారు.

ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానిదే పైచేయిగా నిలిచింది. కార్మికుల ప్రధాన డిమాండ్ గాల్లో కలిసిపోయింది. అదే ఆర్టీసీ విలీనం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధానమైన డిమాండ్ తోనే సమ్మెకు దిగారు కార్మికులు. కానీ కేసీఆర్ సర్కార్ ఈ విషయంలో మొండిగా వ్యవహరించింది. ఎన్ని ధర్నాలు చేసినా, సమ్మెలు చేసినా వెనక్కి తగ్గలేదు. ఒక దశలో హైకోర్టు విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదు.

దీంతో కార్మికులే వెనక్కి తగ్గారు. హైకోర్టు కూడా చేతులెత్తేయడం, విషయం లేబర్ కోర్టుకు రావడం, కార్మికుల ఆర్థిక కష్టాలు రెట్టింపు కావడంతో యూనియన్లు వెనక్కి తగ్గాయి. విలీనం సంగతి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలుంటే అదే పదివేలు అన్నట్టు తయారైంది కార్మికుల పరిస్థితి. అందుకే సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం నుంచి హామీ తీసుకున్న తర్వాతే సమ్మెను విరమించాలని నిర్ణయించుకున్నారు.

యూనియన్లు తీసుకున్న తాజా నిర్ణయంతో బంతి ఇప్పుడు ప్రభుత్వం కోర్టులో పడింది. నిజానికి ఈ నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రామీణ ప్రాంతాల్లో రూట్లను ప్రైవేటీకరిస్తూ ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమ్మెకు ఉన్న స్థితిని యథాతథంగా కొనసాగిస్తూ.. కార్మికులందర్నీ విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంది.

మొత్తమ్మీద 47 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన సమ్మె నీరుగారిపోయింది. భవిష్యత్తులో ఆర్టీసీ కార్మికులే కాదు, ఏ కార్పొరేషన్ కు చెందిన ఉద్యోగులైనా రోడ్డెక్కి సమ్మె చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.