“మరో రెండేళ్లలో ముందస్తు ఎన్నికలు వచ్చినా, జమిలి ఎన్నికలు వచ్చినా వైసీపీ ప్రభుత్వం పని అయిపోతుంది”. తాజా జూమ్ మీటింగ్ లో చంద్రబాబు ప్రవచనాలివి. ఇప్పటికే 16 నెలల పాలన అయిపోయింది, ఇంకెంతకాలం వీళ్లు పాలిస్తారంటూ రెచ్చిపోయారు బాబు. అసలు ఎన్నికలపై చంద్రబాబుకి ఎందుకంత ఆశ, ఎన్నికలొస్తే టీడీపీ గెలుస్తుందని ఎందుకంత భ్రమ. అసలేంటి చంద్రబాబు మానసిక పరిస్థితి?
వ్యవసాయం దండగ అన్న నోరు ఆయనది, రుణమాఫీ పూర్తిగా చేయకుండా రైతుల్ని కష్టాలుపెట్టిన చేతులవి. విద్యుత్ బిల్లుల పెంపుపై రోడ్డెక్కిన జనాల్ని నిలువునా చంపేసిన ఘన చరిత్ర బాబుది. అలాంటి చంద్రబాబు ఇప్పుడు జగన్ పై విమర్శలు చేయడం, రైతులకి మద్దతుగా మాట్లాడటం.. ఎన్నికలొచ్చేస్తున్నాయని చెప్పడం ఆయన మానసిక పరిస్థితిని తెలియజేస్తోంది.
151 సీట్ల భారీ మెజార్టీతో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర కాలేదు. అప్పుడే చంద్రబాబు ఎన్నికల కోసం కలవరిస్తున్నారు. ఓవైపు సీఎం జగన్ నవరత్నాల అమలుతో ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా 151కంటే ఎక్కువ సీట్లు వైసీపీకి వస్తాయని ప్రజలంటున్నారు. మరి చంద్రబాబు ఏ నమ్మకంతో ఎన్నికలు, జమిలీ అని కలవరిస్తున్నారో అర్థం కావడంలేదు.
రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కి నగదు బదిలీ చేస్తామంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించడానికి జూమ్ మీట్ పెట్టిన బాబు.. చివరకు ఎన్నికల వరకు వెళ్లిపోయారు. గతంలో తాను అమరావతి విషయంలో వైసీపీకి రాజీనామా ఛాలెంజ్ విసిరానని, ఇంతవరకు దానికి సమాధానం లేదని గుర్తు చేశారు. రాష్ట్రం జగన్ కి బానిస కాదని, ప్రశ్నిస్తే బండబూతులు తిడుతున్నారని, బూతులకు తానేమీ భయపడబోనని చెప్పుకొచ్చారు బాబు.
ప్రభుత్వం ఆస్తులమ్మి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, అందర్నీ తాకట్టు పెడుతోందని మండిపడ్డారు. మంచి పనులు చేయడానికి అప్పులు చేస్తే తప్పా? పోనీ అప్పులు చేసి చంద్రబాబులాగా జగన్ ఏమైనా జేబులు నింపుకున్నారా? రాజధాని పేరు చెప్పి తాత్కాలిక రేకుల షెడ్లు వేశారా, పోలవరాన్ని సగం కట్టి వదిలేశారా? నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్తున్న ఆర్థిక లబ్ధికి లెక్కలు ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి.
నిజంగానే బాబు కలగన్నట్టు ఎన్నికలు వస్తే చిత్తు చిత్తుగా టీడీపీ ఓడిపోవడం ఖాయం. పోయిన ఎన్నికల్లో చినబాబు ఓడిపోయారు, ఈసారి పెదబాబు కూడా ఓడిపోవడం ఖాయం. కరోనా భయంతో రాష్ట్రాన్ని వదిలి పారిపోయి, ఇన్నాళ్లకు ప్రవాసాంధ్రుడిలా ఏపీకి వచ్చిన చంద్రబాబు.. రైతుల కష్టాలపై కన్నీరు కార్చడం మరీ విడ్డూరం.