సెలబ్రిటీల వివాహ బంధాల్లో ఒడిదుడుకులు సర్వసాధారణమే. ఆ మాటకొస్తే జీవితంలో ఎత్తుపల్లాలు లేనిదెవరకి? మోడల్ రాజీవ్ సేన్, ఆయన భార్య చారు మధ్య వివాహ సంబంధాలపై రకరకాల ప్రచారం జరుగుతోంది. తమ వివాహ బంధంపై జరుగు తున్న ప్రచారానికి రాజీవ్ తెరదించేందుకు స్పందించాడు. ఈ సందర్భంగా ఆయనలో ఓ ఫిలాసఫర్‌ను గమనించొచ్చు.
‘నేను.. నా భార్యను ఎంతగానో ప్రేమిస్తున్నా. కలిసి ఉంటేనే బంధం మరింత బలంగా ఉంటుంది’ అంటూ మోడల్ రాజీవ్ సేన్ అన్నాడు. ఈ సందర్భంగా భార్య, నటి చారు అసోపాతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసి తామెంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. చారును ఎంతగానో మిస్సయ్యానని.. అందుకే ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చేశానంటూ భార్యపై తన ప్రేమాను రాగాలను వ్యక్తీకరించాడు.
అయితే రాజీవ్, చారు మధ్య ప్రేమ ఒకవైపు మాత్రమే ఉందనుకుంటే పొరపాటు. ఇక్కడ రెండు చేతులు కలిసి ప్రేమ చప్పుడు చేయడం విశేషం. భర్తపై చారు తన ప్రేమను ఏ మాత్రం దాచుకోలేదు. భర్తను హత్తుకుని ఉన్న ఫొటోను షేర్ చేసి.. ‘నా భర్తను ప్రేమిస్తున్నా. నిన్నెంతో మిస్సయ్యాను’ అంటూ ప్రేమను చాటుకున్నారు.
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్. నటి చారు అసోపాతో గతేడాది జూన్‌లో రాజీవ్‌కు వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని నెలల తర్వాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పెళ్లి ఫొటోలతో పాటు తాము కలిసి ఉన్న అన్ని ఫొటోలను సోషల్ మీడియా నుంచి వాళ్లిద్దరూ తొలగించారు. ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకునే వరకు వెళ్లారు.
ఈ నేపథ్యంలో చారును ముంబైలో వదిలేసి రాజీవ్ ఢిల్లీకి వెళ్లినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరు విడిపోతు న్నారంటూ బాలీవుడ్‌లో వదంతులు వ్యాపించాయి. ఈ ప్రచారాన్ని మొదట్లో ఈ జంట కొట్టిపారేసింది. విడిపోవడం ఖాయమ నుకునేలా గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేలా విమర్శలకు దిగారు.
అయితే తమ ఫొటోలు షేర్ చేసి ఇద్దరూ అందరినీ ఆశ్చర్యపరిచారు. పరస్పరం తమ మధ్య గాఢమైన ప్రేమ ఉన్నట్టు ప్రకటిం చారు. దీంతో మీరిలాగే కలకాలం సంతోషంగా కలిసి ఉండాలంటూ ఈ జంట అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతుండడం విశేషం.