కెరీర్ స్టార్టింగ్ లో తనకు కూడా అవమానాలు జరిగాయని, చీత్కారాలు ఎదుర్కొన్నానని స్పష్టంచేశాడు నాని. అయితే తనను ఎవరు అవమానించారు, ఎలాంటి అవమానాలు జరిగాయనే విషయాన్ని మాత్రం ఈ హీరో బయటపెట్టలేదు. తను ఇన్ సల్ట్ గురైన మాట నిజమేనంటున్న నాని.. ఇదంతా కెరీర్ లో ఓ భాగం అంటున్నాడు.
“అవమానాలు జరుగుతాయి. వాటిని కెరీర్ లో ఓ ప్రాసెస్ గా తీసుకోవాలి. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినప్పుడు కొన్ని కొన్ని జరుగుతుంటాయి. అవన్నీ ఫేస్ చేయకపోతే ఈరోజు ఈ కిక్ ఉండదు కదా. పైగా ఏదీ ఈజీగా రాకూడదు. కష్టపడాల్సిందే. కొన్ని అవమానాలు జరగాల్సిందే. కానీ జరిగిన అవమానాల్ని తలుచుకుంటూ, దాని గురించి మాట్లాడుతూ ఉండకూడదు. ఎంజాయ్ చేయాలంతే.”
ఇలా తనకు కూడా అవమానాలు జరిగిన విషయాన్ని ఒప్పుకున్నాడు నాని. మరోవైపు కరోనా/లాక్ డౌన్ వల్ల టాలీవుడ్ స్లంప్ లోకి వెళ్లిపోయిందని, నటీనటులు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు నాని.
“నటీనటులు పారితోషికం తగ్గించుకోవాల్సిందే. కాకపోతే దీన్ని కామన్ గా అందరికీ అప్లయ్ చేయకూడదు. ఓవరాల్ గా అందరూ ఇంత తగ్గించుకోండని చెప్పకూడదు. ఎందుకంటే.. కొత్త నటీనటులకు, సూపర్ స్టార్లకు ఒకే పర్సెంటేజీ పెట్టి తగ్గించుకోండని చెప్పకూడదు. సినిమా బడ్జెట్, నిర్మాతకు కలిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత తగ్గించుకుంటే బాగుంటుందనేది హీరోలు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.”
నిర్మాతకు నష్టం లేదు, సినిమాకు మార్కెట్ కూడా బాగా అవుతుందని అనుకున్నప్పుడు ఏ హీరో రెమ్యూనరేషన్ తగ్గించుకోవాల్సిన అవసరం లేదంటున్నాడు నాని. సుధీర్ బాబుతో కలిసి నాని చేసి V సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది.