కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్నవన్నీ సంచలన నిర్ణయాలే. అయితే ఆ నిర్ణయాలతో ఎక్కడా ప్రభుత్వ ఖజానాపై భారం పడదు. ఉద్యోగాల కల్పనతో జీతభత్యాల ఖర్చు పెరిగినా, మానవ వనరుల్ని ఉపయోగించుకుంటే అంతకంటే ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది కాబట్టి దాన్ని భారంగా చూడలేం. రైతులకు, చేనేత కార్మికులకు, ఇతర వర్గాలకు చేస్తున్న ఆర్థిక సాయం కూడా అంతే, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి కాబట్టి అది అంతిమంగా రాష్ట్ర తలసరి ఆదాయం పెరగడానికి దోహదం చేస్తుంది. రాగాపోగా మద్య నిషేధం ఒక్కటే రాష్ట్ర ఆదాయానికి గండికొట్టే పథకం.
మహామహులు సైతం మద్యనిషేధం జోలికి వెళ్లడానికి భయపడ్డారు, ఒకవేళ వెళ్లినా కూడా వెంటనే తమ నిర్ణయాలను వెనక్కు తీసుకున్నారు. అయితే జగన్ మాత్రం మద్యనిషేధంపై గట్టిగానే ఉన్నారు. కొత్త పాలసీ ప్రకారం ఇప్పటికే అమ్మకాలు తగ్గి ఆదాయం పడిపోయింది, అయినా సరే జగన్, అక్కచెల్లెళ్లకు ఇచ్చిన మాటను తప్పలేదు. ఆదాయం మాట అటుంచితే, ఈ పథకానికి ఇప్పటికే చాలాచోట్ల తూట్లు పడుతున్నాయి.
ఇతర రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాల్లో అక్రమంగా మద్యం దిగుమతి అవుతోంది. కేవలం సరిహద్దు జిల్లాల్లోనే కాదు, రాష్ట్రం నలుమూలలా విదేశీ మద్యం తరహాలో, ఇతర రాష్ట్రాల మద్యం అందుబాటులోకి వస్తోంది. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లోనే కొంతమంది అక్రమార్కుల వల్ల ఈ తతంగం నడుస్తోంది. గతంలో వైన్ షాపుల ఓనర్లు, మందు అమ్మకాల ద్వారా ఆదాయాన్ని రుచి చూసిన చాలామంది ఇలా ఇతర రాష్ట్రాల మద్యం అమ్మకాలకు అలవాటు పడ్డారు, జనాలను అలవాటు చేశారు.
విచిత్రం ఏంటంటే.. వైన్ షాపుల్లో ప్రభుత్వం నియమించిన ఉద్యోగులే ప్రభుత్వ ఆశయాన్ని నీరుగారుస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం షాపులు తెరిచి ఉంచాలనేది నిబంధన. అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాత్రి 10 గంటలకు కూడా మద్యం దొరుకుతోందనేది వాస్తవం. 8 గంటలకు షట్టర్ మూసేసినా, లెక్కలు చూసుకుంటున్నామనే సాకుతో ఉద్యోగులు షాపులోనే ఉంటున్నారు. 8 గంటల తర్వాత బైటకు పోయే ప్రతి సీసాను అధిక ధరకు అమ్ముకుంటూ అక్రమార్జనకు అలవాటు పడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లో పర్యవేక్షణ తక్కువగా ఉంటుంది కాబట్టి 10, 11 గంటల వరకు షాపులు ఇలా అనధికారికంగా తెరిచే ఉంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కూడా ఎక్సైజ్ సిబ్బంది పర్యవేక్షణ లోపించడం, అందులోనూ అది ప్రభుత్వ దుకాణమే, షాపులో ఉండేవాళ్లు ప్రభుత్వం నియమించిన ఉద్యోగులే కావడంతో ఎవరూ ఈ అక్రమాలపై దృష్టి పెట్టడం లేదు. కానీ గ్రామాల్లో మాత్రం ఇలా అధిక ధరకు మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి.
రాత్రి 8 తర్వాత మందు దొరక్క మందుబాబులు త్వరగా ఇళ్లకు చేరుకుని, భార్యా బిడ్డలతో సేదతీరి మద్యం వ్యసనాన్ని మానేయడం అనేది ఈ టైమింగ్స్ లక్ష్యం. కానీ సీఎం అనుకుంటున్నట్టు టైమ్ టేబుల్ ప్రకారం మద్యం అమ్మకాలు జరగడం లేదు. అక్రమార్కులు జగన్ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. ఇప్పటికైనా ఓసారి మద్యం విధానంపై సమీక్ష జరిపి, నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.