పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమా చేస్తారో? అసలు చేయరో ఆయనకు తప్ప మరెవరికి తెలియదు. నెల రోజుల క్రితం అయితే జనవరి నుంచి రెడీ అవ్వండి అని పింక్ రీమేక్ చేసే దిల్ రాజుకు, మార్చి తరువాత డేట్ లు ఇస్తా ప్రిపేర్ అవ్వండి అని డైరక్టర్ క్రిష్ కు చెప్పినట్లు నమ్మదగ్గ వార్తలు అయితే వున్నాయి.
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పదిహేను రోజల పాటు రాజకీయాల్లో హడావుడి చేసి, ఇప్పుడిప్పుడే మళ్లీ హైదరాబాద్ గూటికి చేరారు పవన్ కళ్యాణ్. మరి సినిమాలు చేసే మూడ్, ఉత్సాహం వుందో? లేక రాజకీయాల్లో బిజీగా అవుతారో ఇంకా తెలియదు.
కానీ ఈలోగా ఎవరి గ్యాసిప్ లు వాళ్లు అల్లేస్తున్నారు. పింక్ సినిమాను మొదట బాలకృష్ణ తో రీమేక్ చేద్దాం అనుకున్నారు నిర్మాత దిల్ రాజు. అయితే ఆయన ఓకె అన లేదు అది వేరే సంగతి. అప్పట్లో బాలయ్య ఓకె అంటే కనుక 'లాయర్ సాబ్' అనే టైటిల్ అయితే బాగుంటుంది అనుకున్నారు. ఆ మేరకు అప్పట్లో వార్తలు వచ్చాయి కూడా. కానీ టైటిల్ రిజిస్ట్రేషన్ అయితే కాలేదు.
ఇప్పుడు అది గుర్తుకు వచ్చింది జనాలకు. అంతే. పవన్ సినిమాకు టైటిల్ లాయర్ సాబ్ అనే గ్యాసిప్ పుట్టేసింది. ఇలా అందరూ లాయర్ సాబ్..లాయర్ సాబ్ అంటే పవన్ కళ్యాణ్ 'పింక్' రీమేక్ లాయర్ సాబ్ అయిపోతుందేమో? కానీ ఒకటే సమస్య దిల్ రాజు టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించేలోగా, ఇదేదో బాగుందని ఎవరైనా చేయించేస్తే, కష్టమే.