ఆ మధ్య అమిత్ షాను కలిసి తన గోడును వెల్లబోసుకోవడానికి ఢిల్లీ వరకూ వెళ్లి వచ్చారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. అప్పుడు అమిత్ షా కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. అదేమంత సుదీర్ఘ పర్యటన కాదు. అమిత్ షా అపాయింట్ దక్కుతుందనే నమ్మకమే ఉంటే.. చంద్రబాబు నాయుడు ఇంకో రోజు ఢిల్లీలో బస చేసి ఉన్నా, ఆయనకు అదో లెక్క కాదు.
ఎలాగూ ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా ఏపీలో ఉండటం లేదు. కేరాఫ్ హైదరాబాదే. అలాంటప్పుడు ఇంకో రోజు ఢిల్లీలోనే వేచి ఉండి, షాతో సమావేశం కావడం పెద్ద కథ కాదు. ఎలాగూ చంద్రబాబు రిటర్న్ అయ్యే సమయానికి షా ఢిల్లీ వచ్చేశారు. ఇంకో రోజు వేచి ఉంటే.. జగన్ పై చేయాల్సిన ఫిర్యాదులన్నీ చేసేసి రావొచ్చు. అయితే చంద్రబాబు ఏదో పని ఉన్నట్టుగా తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు!
ఆ తర్వాత షా నుంచి ఫోన్ అని మరో కథేదో అల్లారు. అలాగని దాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు! ఇలా డ్యామేజ్ కవరేజ్ ఏదో చేసుకున్నారు. సరే.. అదంతా అయిపోయిన కథ. మరి అమిత్ షానే ఏపీ వచ్చారు కదా. తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఒక సదస్సు కోసం షా తిరుపతి రావడం, వెళ్లడం అయిపోయింది. మరి అప్పుడు అమిత్ షా దర్శనం పార్టీలకు అతీతంగా చాలా మందికి దక్కింది కదా! మరి తిరుపతి వరకూ వచ్చిన అమిత్ షాను చంద్రబాబు నాయుడు ఎందుకు కలవలేకపోయినట్టు?
కంప్లైంట్లు ఇవ్వడం సంగతలా ఉంటే.. మర్యాదపూర్వకంగా అయినా కలిసే అవకాశం ఉండేదే కదా! ఏ ఐదు నిమిషాలో పది నిమిషాలో… అయినా అపాయింట్ మెంట్ దక్కేది కదా! రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి వచ్చారు, ప్రధాన ప్రతిపక్ష నేత కలవాలనుకోవడం పెద్ద విడ్డూరమైన విషయమూ కాదు. మరి చంద్రబాబు నాయుడు తనను చూడటానికి ఢిల్లీ వచ్చారని, తను కలవలేకపోయినందుకు షా ఫీలయ్యారని పచ్చ మీడియా చెప్పింది కదా! మరి ఇప్పుడు ఏపీకి వచ్చిన తరుణంలో షానే చంద్రబాబును పిలిపించుకోవడమో లేక తనే పలకరించడమో కూడా జరగలేదే!
ఢిల్లీ వెళ్లి వచ్చినప్పుడంటే ఏదో కథ అల్లారు. మరి షా నే ఏపీకి వచ్చినప్పుడు మాత్రం టీడీపీ అధినేత అటువైపు తొంగి చూసే ధైర్యం కూడా చేయలేదు. అపాయింట్మెంట్ కోరినా దక్కుతుందో లేదో తెలియదు, దక్కిందే అనుకున్నా… కనీసం అమిత్ షాను వెళ్లి కలిస్తే.. ఆయన ఎలా అవమానిస్తారో అనే భయం కూడా చంద్రబాబుకు గట్టిగా ఉన్నట్టుగా ఉంది. అందుకే.. సమావేశ ప్రయత్నాలు కూడా ఏమీ జరిగినట్టుగా లేవనే స్పష్టత స్పష్టంగానే వస్తోంది!