కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ వేళ పచ్చ మీడియా గగ్గోలు పెట్టి గాయి రేపింది. దొంగ ఓట్లు పడిపోతున్నాయని, పుంగనూరు నుంచి ఓట్లేసేస్తున్నారని, కుప్పం నియోజకవర్గం పరిధిలోని టీడీపీ వాళ్లను పోలింగ్ బూతుల వద్ద ఆపుతున్నారంటూ.. పచ్చమీడియా తమదైన డ్రామాను రక్తికట్టించే ప్రయత్నం చేసింది. ఈ డ్రామాలో పచ్చ చొక్కాలు తమ వంతు పాత్రను పోషించారు.
వాళ్లది కుప్పం మున్సిపాలిటీ పరిధి కాదని వారే చెబుతున్నారు. వారు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వారట. మరి వాళ్లకు పోలింగ్ బూత్ ల వద్ద ఏం పనో మరి! ఒక ఒకరిద్దరు వెళ్తున్న వ్యక్తులను చూపిస్తూ.. వారు దొంగ ఓట్లు వేయడానికి వచ్చారంటూ గంటల కొద్దీ ప్రోగ్రామ్ లు ప్రసారం చేశాయి పచ్చమీడియా వర్గాలు.
ఇక కుప్పం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర నుంచి చోటామోటా నేతల వరకూ ఎవరి స్థాయిలో వారు రచ్చలు చేశారు, చేస్తున్నారు. స్థూలంగా టీడీపీ గగ్గోలును గమనిస్తే.. ఇది గెలుపుపై ఏ మాత్రం నమ్మకం లేకపోవడమేనా? అనే సందేహం సహజంగానే కలుగుతోంది. ప్రచారం మొదలైన దగ్గర నుంచి ఇదే తంతును చేపట్టింది టీడీపీ!
ఒకవైపు తాము ప్రచారం చేసుకుంటూ.. అక్రమాలు.. అక్రమాలు అంటూ.. గగ్గోలు పెడుతోంది. పోలింగ్ సమయానికి ఈ రచ్చ మాత్రమే చూపింది పచ్చమీడియా. దీన్ని బట్టి.. ఓటమికి ఇదంతా ప్రిపరేషన్లో భాగమే అని, ఓటమి ఖరారు కావడంతో.. టీడీపీ ఈ తరహా రచ్చ చేసి.. తమ ఓటమిని తక్కువ చేసి చూపించుకోవచ్చనే ప్రణాళికతో ఉంది. సహజంగా చంద్రబాబు తరహా రాజకీయ వ్యూహాలు ఇలానే ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదు.
మంత్రి వర్గం నుంచి తీసేయాల్సిన వ్యక్తిపై అవినీతి ముద్ర వేయడంతో మొదలుపెడితే.. తమ ఓటమి ఎదురైన చోట ఎన్నికలు సరిగా జరగలేదని అనడం వరకూ టీడీపీకి అలవాటైన వ్యూహాలే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఈవీఎంల మీద అనుమానాలు అంటూ రచ్చ చేశారు. తీరా కేంద్రంలో మోడీ సర్కారు రావడంతో ఆ తర్వాత ఈవీఎంల మీద అనుమానాలను అటకెక్కించారు.
అలా మాట్లాడితే.. తీసుకెళ్లి లోపలేస్తారనే భయంతో, ఫలితాలు వచ్చాకా ఈవీఎంల మీద కిక్కురుమనలేకపోతున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో మాత్రం ఈవీఎంల మీద నిందలేస్తూ గగ్గోలు పెట్టారు. ఇలాంటి గగ్గోలు సారాంశం అంతే.. ఓటమికి ముందస్తూ సూచిక అన్నట్టుగా మారింది టీడీపీ వ్యవహారం. బహుశా కుప్పం విషయంలో కూడా ఇదే జరుగుతోందేమో!