తమిళ సినిమాలు కులం గురించి ఎంత ధైర్యంగా చర్చించగలుగుతున్నాయో, మరోవైపు అదే తమిళనాట వివిధ సినిమాలపై కుల సంఘాల రచ్చ కూడా గట్టిగా ఉంటుంది. అవతలి రాష్ట్రాల్లో కూడా ఆకట్టుకునే తమిళ సినిమాలు తమిళనాట కొన్ని కుల సంఘాలకు అభ్యంతకరం అవుతుంటాయి. ఆ మధ్య మండేలా సినిమాపై ఒక కుల సంఘం అభ్యంతరాలను చెప్పింది.
తమ కులాన్ని అవమానించేలా ఆ సినిమా ఉందని కొంతమంది కోర్టుకు వెళ్లారు. అయితే కుల వివక్ష గురించి తెరపై చర్చించే ధైర్యం చేసిన ఆ సినిమా కు కోర్టు ఎలాంటి బ్రేకులూ వేయలేదు.
ఆ సంగతలా ఉంటే.. జైభీమ్ సినిమాపై మరో కులం కోర్టును ఆశ్రయించింది. ఈ సినిమాలో తమ కులాన్ని అవమానించారని, అందుకు ఐదు కోట్లు చెల్లించాలని ఈ సినిమా నిర్మాణ సంస్థపై దావా వేశారు. ఈ సారి అభ్యంతరం చెప్పింది వన్నియార్లు. ఈ కులాన్ని ఓన్ చేసుకునే, ఈ కులం ఓట్లు ఉన్న ప్రాంతంలో గట్టిగా పని చేసే పీఎంకే పార్టీ ఇప్పుడు జై భీమ్ పై మండి పడుతోంది.
ఈ సినిమాలో చెంచులను జైల్లో వేసి చిత్రహింసలు పెట్టే పోలీసాఫీసర్ పాత్రను తమ కులం వాడన్నట్టుగా చూపారనేది వన్నియార్ల అభ్యంతరం. అయితే ఎక్కడా అలాంటి సంబోధన ఉండదు. అయితే.. అతడి వెనుక ఒక క్యాలెండర్ ఉంటుందట, ఆ క్యాలెండర్ మీద వన్నియార్లకు సంకేతం అయిన ఒక చిహ్నమేదో ఉంటుందట!
ఆ పాత్రకు వన్నియార్ల పేరు ఏమీ పెట్టలేదు. సినిమాలో రకరకాల సందర్భాల్లో కుల ప్రస్తావన వచ్చినా.. పోలీసాఫీసర్ల కులం గురించి మాత్రం ప్రస్తావించలేదు. వారి అసలు పేర్లను కూడా ప్రస్తావించలేదు. బాధితుల కులం గురించి మాత్రమే చర్చించారు. అయితే.. ఆ పోలీసాఫీసర్ పాత్ర కనిపించే సీన్లో వెనుకవైపు ఉండే క్యాలెండర్ మీద తమ కులాన్ని సూచించే చిహ్నం ఉందంటూ.. అది తమ కుల ప్రతిష్టకు భంగమంటూ, ఐదు కోట్లు చెల్లిస్తే పోయిన పరువుకు చెల్లు అవుతుందనే పిటిషన్ పట్ల కోర్టు ఎలా స్పందిస్తుందో!