వైసీపీ నేతలు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తుంటే ప్రజల్లో తనపై సింపతీ పెరుగుతోందని సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించారట జనసేనాని. ప్రజల తరపున తాను చేస్తున్న పోరాటాలతో తనపై నమ్మకం కూడా పెరుగుతోందని అంటున్నారట.
ఈ ఎన్నికల్లో జగన్ కు, జగన్ పార్టీకి సింపతీ ఓట్లే పడ్డాయని, అలాంటి సింపతీయే ఇప్పుడు తనపై ప్రజల్లో కలుగుతోందని అనుకుంటున్నారట. అసలు పవన్ కల్యాణ్ దృష్టిలో సింపతీ అంటే ఏంటో విన్నవారికి అర్థం కాక సరేనని తలాడించి వదిలేశారట.
ఇప్పుడే కాదు, గతంలో కూడా పవన్ దృష్టిలో జగన్ ది సింపతీ విజయమే. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి రాజన్న రాజ్యం తెచ్చి చూపిస్తానంటూ జగన్ చేసిన ప్రచారానికి జనమంతా ఓట్లేశారంటూ అనేవారు పవన్. ఒక్కసారి చూద్దామని ఓట్లు వేసిన ప్రజలు వందరోజుల పాలనకే విసిగిపోయారంటూ చంద్రబాబుకి వంతపాడారు. పవన్ అనుకుంటున్నట్టు జగన్ ది సింపతీ విజయం ఎందుకవుతుంది.
తండ్రి చనిపోయిన ఏడాదే ఎన్నికలు వచ్చి, ఆ ఎన్నికల్లో జగన్ గెలిచి ఉంటే అది సింపతీ విజయం అయి ఉండేది. అధికారంలో లేకపోయినా అప్పుడు కాంగ్రెస్ అరాచకాల్ని, ఆ తర్వాత టీడీపీ దుర్మార్గాలను ఎదుర్కొని, చేజారిన ఎమ్మెల్యేల విషయంలో భయపడకుండా, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుని, రాష్ట్రమంతా అఖండ పాదయాత్ర చేసి అందుకున్న ఘన విజయం ఇది. ఇది సింపతీ విజయం ఎలా అవుతుందో పవన్ కే తెలియాలి.
పోనీ తనపై ప్రజల్లో సింపతీ పెరుగుతోందని అనుకుంటున్న పవన్.. అదికూడా వాస్తమో కాదో అని తేల్చుకోలేకపోతున్నారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన చేస్తున్న పోరాటాలతో పవన్ ప్రజల్లో పలుచన అవుతున్నారు.
చంద్రబాబుకి వంతపాడుతూ, దత్తపుత్రుడు అనే పేరు తెచ్చుకున్నారు. ఇసుక సమస్యలో విషయ పరిజ్ఞానం లేక, ఇంగ్లిష్ మీడియం విషయంలో అసలు సమస్య ఏంటో తెలియక.. అయోమయంలో ఉన్నారు పవన్.
పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారంటూ జగన్ ప్రశ్నిస్తే, పెళ్లాల గురించి మాట్లాడారంటూ ఉడుక్కుంటున్న పవన్ ఏపాటి నాయకుడో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
ప్రశ్నకు జవాబివ్వకుండా పలాయనవాదం చిత్తగిస్తున్న పవన్ కల్యాణ్ పై ఒక రకంగా ప్రజల్లో సింపతీ పెరుగుతున్న మాట వాస్తవం. చంద్రబాబు ఉచ్చులో పడి రాజకీయ భవిష్యత్ ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారని పవన్ ని చూసి ప్రజలు జాలి పడుతున్నారు.