తన పెళ్లిపై మరోసారి రియాక్ట్ అయ్యాడు హీరో నిఖిల్. చాన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న అర్జున్ సురవరం సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత తన పెళ్లిపై ఓ ప్రకటన చేస్తానంటున్నాడు ఈ హీరో. సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టాడు.
పనిలోపనిగా కొన్ని ఆసక్తికర సంగతుల్ని కూడా షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా వీఐ ఆనంద్ తో మరోసారి కలిసి వర్క్ చేయబోతున్నట్టు ప్రకటించాడు.
“ఎక్కడికి పోతావ్ చిన్నవాడా నా కెరీర్ లోనే వెరీ స్పెషల్ మూవీ. ఆ మూవీ మూడేళ్లు పూర్తిచేసుకుంది. ప్రస్తుతం వీఐ ఆనంద్ డిస్కోరాజా సెట్స్ లో ఉన్నాడు. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. త్వరలోనే మా ఇద్దరి కాంబోలో మరో సినిమా కూడా ఉంటుంది.”
మల్టీస్టారర్ మూవీస్ లో నటించడం తనకు ఇష్టమేనని కానీ సరైన కథ దొరకడం లేదంటున్నాడు నిఖిల్. స్టోరీ సెట్ కాకపోవడం వల్ల రీసెంట్ గా రానాతో కలిసి చేయాల్సిన సినిమా కూడా వదులుకున్నట్టు తెలిపాడు.
“మల్టీస్టారర్ మూవీ చేయాలని ఉంది. కానీ మంచి స్క్రిప్ట్ సెట్ అవ్వడం లేదు. మల్టీస్టారర్ కాన్సెప్ట్ తో మంచి సినిమా చేద్దాం అనుకున్నాం. మొన్న రానాతో ఓ సినిమా చేయాల్సింది. నేను మిస్ అయ్యాను. మరోసారి ఆ ఛాన్స్ వస్తే మాత్రం మిస్ చేసుకోను. మంచి స్క్రిప్టులు వెదికి పట్టుకోవడంలో రానా స్పెషలిస్ట్.”
పవన్ కల్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ వస్తే వదులుకోనంటున్నాడు నిఖిల్. అవసరమైతే తన సినిమాను కాన్సిల్ చేసుకొని మరీ పవన్ తో కలిసి నటిస్తానని, తన సినిమా నిర్మాత నష్టాల్ని కూడా తనే భరిస్తానని, పవన్ తో సినిమా ఛాన్స్ మాత్రం వదులుకోనని అంటున్నాడు.
ఈరోజు సాయంత్రం అర్జున్ సురవరం సినిమా థియేట్రికల్ ట్రయిలర్ ను లాంఛ్ చేయబోతున్నారు.