ప్రతి రోజూ పండగే సినిమాకు సంబంధించి ఓ కొత్త సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు మారుతి. ఈ సినిమా కథను చిరంజీవి విన్నారు కాబట్టి, సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చెబుతున్నాడు. దీని వెనకున్న ఓ చిన్న సెంటిమెంట్ ను బయటపెట్టాడు.
“భలే భలే మగాడివోయ్ స్క్రిప్ట్ ఫస్ట్ చిరంజీవి గారికి చెప్పాను. అది విని ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచి కథ చెప్పావ్ అన్నారు. ఆ తర్వాత మళ్లీ ప్రతిరోజూ పండగే సినిమా కథ చిరంజీవి గారికి చెప్పాను. దాదాపు 3 గంటల పాటు నా కథ విన్నారు. చాలా హెల్దీగా చేశావ్ స్క్రిప్ట్ అన్నారు. ఆయన ఇచ్చిన ఎనర్జీతోనే పనిచేశాం, షూటింగ్ పూర్తిచేశాం.”
తన సినిమా స్టోరీకి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న గాసిప్స్ ను నమ్మొద్దంటున్నాడు మారుతి. రెగ్యులర్ గా వచ్చే తాత-మనవడు సెంటిమెంట్ లాంటి సినిమా కాదని, ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై ఈ పాయింట్ రాలేదని చెబుతున్నాడు.
“సోషల్ మీడియాలో చాలామంది మా సినిమా గురించి తమకు నచ్చిన స్క్రిప్ట్ లు రాసుకుంటున్నారు. తాత-మనవడు కథ అనేసరికి వాళ్లకు తోచింది వాళ్లు రాసేస్తున్నారు. ఊరి బాగు కోసం వచ్చాడని, తండ్రి-తాతను కలిపాడని ఏదేదో చెబుతున్నారు. కానీ అవేం కాదు. ఇలాంటి పాయింట్ ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు రాలేదు.”
మనిషి పుట్టుకను సెలబ్రేట్ చేస్తుంటారని… అలాగే ఓ వ్యక్తి చనిపోతున్నప్పుడు కూడా అతడికి బెస్ట్ సెండాఫ్ ఇవ్వాలనేది తన సినిమా కాన్సెప్ట్ అంటున్నాడు. ఈ బరువైన కాన్సెప్ట్ నే ఎంటర్ టైనింగ్ గా చెప్పడానికి ప్రయత్నించామంటున్నాడు.