విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిట్ అని కొందరంటారు, సోమవారం నుంచి డ్రాప్ అయిందని మరికొందరంటారు. అటు విజయ్ దేవరకొండతో పాటు, యూనిట్ అంతా సక్సెస్ పండగలు చేసుకుంటోంది. మరి ఈ మొత్తం వ్యవహారంలో సమంతకు కలిసొచ్చిందేంటి?
ఖుషి రిజల్ట్ కోసం విజయ్ దేవరకొండ ఎంత వెయిట్ చేశాడో, సమంత కూడా అంతే ఎదురుచూసింది. ఈ సినిమా సక్సెస్ దేవరకొండకు ఎంత అవసరమో.. సమంతకు కూడా అంతే అవసరం. విజయ్ దేవరకొండకు ఉన్నట్టుగానే, సమంతకు కూడా తనకంటూ ఓ మార్కెట్ ఉంది. ఖుషి సినిమాతో సమంత మార్కెట్ నిలబడిందా?
క్రెడిట్ మొత్తం దేవరకొండదేనా..?
ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న సక్సెస్ సంబరాలు చూస్తుంటే.. క్రెడిట్ మొత్తం విజయ్ దేవరకొండ ఖాతాలోకే వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అంతా విజయ్ నామస్మరణ చేస్తున్నారు, విజయాన్ని అతడికే ఆపాదిస్తున్నారు. మార్కెట్లో ఓ సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా ఆ క్రెడిట్ హీరోకే దక్కుతుంది. అక్కడ విజయ్ ఉన్నా, మరో హీరో ఉన్నా ఈ విషయంలో తేడా లేదు. కానీ ఖుషి పరిస్థితి వేరు. కథాపరంగా ఈ సినిమాలో సమంతది చాలా పెద్ద రోల్. హీరోతో సమానంగా సినిమాను మోసింది సమంత. కాబట్టి ఆమెకు కూడా సక్సెస్ లో షేర్ ఇవ్వాల్సిందే. కానీ సక్సెస్ సంబరాల్లో నామ్ కే వాస్తే వినిపిస్తోంది సమంత పేరు. ఇది చాలదు.
క్రెడిట్ దక్కినా 'గ్యాప్'లో కొట్టుకుపోతుందా?
సమంత మార్కెట్ నిలబడాలన్నా, ఆమెకు ఇంకాస్త ఎక్కువ గుర్తింపు కావాలన్నా.. ఆమె పేరు గట్టిగా వినిపించాలి. అలా చప్పుడు చేయాలంటే, సమంత గ్రౌండ్ లోకి రావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సమంత ఆ పని చేయలేదు. పోనీ, కనీసం సోషల్ మీడియాలోనైనా సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటుందా అంటే అదీ లేదు. ఆమె ఖుషీని వదిలేసి దాదాపు 3-4 రోజులు అవుతోంది.
ఈ ఊపులో సమంత మరో సినిమా ఎనౌన్స్ చేసి, సెట్స్ పైకి వస్తే, ఖుషి కాస్తోకూస్తో ఆమెకు పనికొచ్చేది. కానీ ఆ అవకాశం కూడా లేకుండాపోయింది. సమంత ప్రస్తుతం 'గ్యాప్'లో ఉంది. సినిమాలకు విరామం ఇచ్చింది. ఖుషి క్రెడిట్ ఆమెకు కాస్తోకూస్తో దక్కిందనుకుంటే, ఈ గ్యాప్ లో అది కాస్తా కొట్టుకుపోవడం ఖాయం.
మరో ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ రావాల్సిందే?
సమంత మార్కెట్ పరిస్థితేంటి? శాకుంతలంతో తగ్గిన ఆమె మార్కెట్, ఖుషితో మళ్లీ పెరిగిందా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే, సమంత నుంచి మరో లేడీ ఓరియంటెడ్ మూవీ రావాల్సిందే. అప్పటివరకు ఆమె మార్కెట్ పై అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది.