తాను నిప్పు అంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం మాత్రం మానలేదు. రూ.118 కోట్ల ముడుపులకు సంబంధించి ఐటీశాఖ నోటీసులు జారీ అయిన తర్వాత కూడా ఆయన పాత మాటలే వల్లె వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన మాటల్ని నమ్మే పరిస్థితి లేదని ఆయన ఇంకా గ్రహించినట్టు లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌పై అక్కసు వెళ్లగక్కారు.
తనను అరెస్ట్ చేస్తారేమో అనే భయాన్ని వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. అయితే తనను కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తాయా? లేక రాష్ట్ర ప్రభుత్వమా? అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అరెస్ట్ అంటూ సెంటిమెంట్ రాజేసి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే అనుమానం కూడా లేకపోలేదు. జగన్ సైకో సీఎం మాత్రమే కాదన్నారు. కరడు గట్టిన సైకో అని ఘాటు విమర్శ చేశారు. రేపో, ఎల్లుండో తనను అరెస్ట్ చేయొచ్చని చంద్రబాబు సంచలన వ్యాఖ్య చేశారు. ఒకవేళ అరెస్ట్ చేయకపోయినా, దాడైనా చేస్తారని ఆయన అనడం చర్చనీయాంశమైంది.
అంగళ్లలో తనపై హత్యాయత్నం చేయడమే కాకుండా తనమీదే 307 కేసు పెట్టారన్నారు. తాను చెబితేనే దాడులు చేసినట్టు స్టేట్‌మెంట్ ఇవ్వాలని తమ పార్టీ నాయకులపై ఒత్తిడి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. యువగళానికి వచ్చి దాడులు చేసి వాళ్లపైనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కరడు గట్టిన సైకో సీఎం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. తమ పైన కేసులు పెట్టి లండన్‌లో ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో.. ఏం చేస్తున్నారో అంటూ చంద్రబాబు నాయుడు వ్యంగ్యంగా అన్నారు.
చంద్రబాబు చిల్లరగా మాట్లాడ్తారనేందుకు ఈ కామెంట్స్ చాలని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. తన కుమార్తెల దగ్గరికి వెళ్లిన జగన్‌పై చంద్రబాబు అవాకులు చెవాకులు పేలడం ద్వారా తన పెద్దరికాన్ని పోగొట్టుకున్నారని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తనను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తాయనే భయం చంద్రబాబును వెంటాడుతోందని వారు అంటున్నారు.