నెపొటిజం, కాస్టింగ్ కౌచ్ లాంటివి చాలా సున్నితమైన అంశాలు. లైమ్ లైట్లో ఉన్న వాళ్లు వీటిపై పెద్దగా స్పందించరు. ఎందుకంటే అవకాశాలు రావనే భయం. కేవలం అవకాశాలు రాని వాళ్లు, ఇండస్ట్రీ నుంచి తప్పుకున్న వాళ్లు మాత్రం ఈ అంశాలపై స్పందిస్తుంటారు. ఓ సీనియర్ నటి కూడా ఇలానే స్పందించింది. కానీ కూతురు కెరీర్ ను ఇరుకున పెట్టింది.
పూనమ్ థిల్లాన్.. బాలీవుడ్ జనాలకు పరిచయం అక్కర్లేని పేరు. హిందీ చిత్రసీమతో దాదాపు 4 దశాబ్దాల అనుబంధం ఉంది ఈమెకు. స్టార్ స్టేటస్ రాకపోయినా, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడీమె తన కూతురు పలోమా థిల్లాన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. ఇప్పుడిప్పుడే ఆమె ఇండస్ట్రీలో అడుగులు వేస్తోంది. ఇలాంటి టైమ్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది పూనమ్.
ఇండస్ట్రీలో నెపొటిజం ఉందన్న పూనమ్.. తానెప్పుడూ దాన్ని ఖాతరు చేయలేదని ప్రకటించింది. రాజశ్రీ బ్యానర్ లో ఒక్క సినిమా కూడా చేయలేదని, అయినప్పటికీ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నానని కామెంట్ చేసింది. ఇక సూరజ్ భర్జాత్యా సినిమాలు చూశాను కానీ, అతడ్ని ఎప్పుడూ కలవలేదని ప్రకటించింది. తాను ఎప్పుడూ హీరోలు, వాళ్ల వారసుల్ని పట్టించుకోలేదని.. తన కూతురుకు అవకాశం ఇవ్వమని ఎవ్వర్నీ అడగనని బహిరంగంగా ప్రకటించింది.
పూనమ్ వ్యాఖ్యలతో పలోమా కెరీర్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. హీరోయిన్ గా అవకాశాలు రావాలంటే బాలీవుడ్ లో ఏం చేయాలో అందరికీ తెలిసిందే. ఓ వర్గానికి దగ్గరవ్వాలనేది బహిరంగ రహస్యం. కానీ పూనమ్ వ్యాఖ్యలతో, ఆ వర్గం పలోమాను దూరం పెట్టే ప్రమాదం ఉంది. అలా తల్లి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూతురు కెరీర్ ను ప్రశ్నార్థకంగా మార్చాయి.