శివనిర్వాణ చేసిన తప్పులేమిటి?

నిను కోరి, మజిలీ ఈ రెండు సినిమాలు కలిసి దర్శకుడు శివనిర్వాణను ఓ స్థాయిలో నిల్చోపెట్టాయి. కానీ టక్ జగదీష్ ఆయన స్థాయిని తగ్గించింది. అదృష్టం కొద్దీ అది ఓటిటికి వెళ్లిపోయింది కనుక శివ…

నిను కోరి, మజిలీ ఈ రెండు సినిమాలు కలిసి దర్శకుడు శివనిర్వాణను ఓ స్థాయిలో నిల్చోపెట్టాయి. కానీ టక్ జగదీష్ ఆయన స్థాయిని తగ్గించింది. అదృష్టం కొద్దీ అది ఓటిటికి వెళ్లిపోయింది కనుక శివ నిర్వాణకు పెద్దగా డ్యామేజ్ జరగలేదు. కానీ ఖుషీ సినిమా గట్టి డ్యామేజ్ చేసేలాగే కనిపిస్తోంది. ఖుషీ సినిమాకు మీడియాను హిట్ రేంజ్ అప్రిసియేషన్, కామెంట్లు దక్కాయి. కానీ గ్రవుండ్ లెవెల్ లో మాత్రం రాలేదు. డే వన్ నుంచే గ్రౌండ్ లెవెల్ లో డివైడ్ టాక్ వచ్చింది. అదే అలా పెరుగుతూ వచ్చి, సినిమాను డౌన్ చేసేసింది.

సినిమాకు నిర్మాతల లోపం లేదు. ఎందుకంటే ఖర్చు కనిపిస్తోంది. సమంత, విజయ్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ ఇలా మొత్తం స్టార్ కాస్ట్ కనిపిస్తోంది. టెక్నికల్ బ్రిలియన్స్ కనిపిస్తోంది. మంచి పాటలు వచ్చాయి. అందమైన లొకేషన్లు, సినిమాకు ఏం కావాలో అన్నీ ఇచ్చారు. ఇక అంతకు మించి నిర్మాతల చేతిలో లేదు. దర్శకుడు శివనిర్వాణదే.

ఖుషీ సినిమాకు గ్రవుండ్ లెవెల్ లో వచ్చిన కీలక కంప్లయింట్ లు రెండు. పెద్దగా కొత్త పాయింట్ లేదా కథ లేదు సినిమాలో అన్నది ఒకటి. ద్వితీయార్థంలో బలమైన కాన్ ఫ్లిక్ట్ లేకుండానే, సీన్లు చాలా బలమైనవి అనే భావన కలిగించే ప్రయత్నం చేసారు అన్నది రెండోది. సాధారణంగా టీవీ సీరియళ్లలో ఇలాంటి వ్యవహారం వుంటుంది. అక్కడ వుండే విషయం తక్కువ. బ్యాక్ గ్రవుండ్ స్కోర్, నటుల హావభావాలు ఎక్కువ.

పాటలు ఎంత బాగున్నా, హిట్ సాంగ్స్ అన్నీ తొలిసగంలోనే ప్లేస్ చేసేసారు. మలిసగంలో సరైన సాంగ్ లేకుండా పోయింది. సినిమా బరువు అంతా మలిసగం మీద పడిపోయింది. దాంతో మలిసగం వీక్, బోర్, భరించడం కష్టం అన్న టాక్ బలంగా వెళ్లిపోయింది. జనాలు మలిసగంతో ఎంత డిస్ కనెక్ట్ అయ్యారంటే, చివర్న ప్లేస్ చేసిన బ్రహ్మానందం ఎపిసోడ్ ను చూడకుండానే చాలా మంది వెనుదిరిగారు. ఎందుకంటే అది వుండదని తెలియదు. ఇక సినిమా అయిపోయింది అని ఫిక్స్ అయిపోయారు. ద్వితీయార్థాన్నే కాదు, ఈ బ్రహ్మానందం ఎపిసోడ్ ను కూడా క్రిస్ప్ గా రాసుకోవడం లేదా తీయడం అన్నది దర్శకుడికి కుదరలేదు.

సినిమా కు వచ్చిన బజ్, సమంత, విజయ్ దేవరకొండ ఫ్యాక్టర్, పాటలు ఇవన్నీ కలిసి సినిమాను మూడు రోజులు గట్టిగా ముందుకు నెట్టాయి. అక్కడ నుంచి కంటెంట్ నే డ్రయివ్ చేయాలి. అది జరగలేదు. శివనిర్వాణ  ఇక మీదట ఇక ‘సీరియల్’ టైపు సినిమాలను శివనిర్వాణ కాస్త పక్కన పెట్టాలి. టక్ జగదీష్ సినిమా చూస్తే అర్థం అవుతుంది ఈ ‘సీరియల్’ టైపు సినిమా అంటే ఏంటో. ఈ సినిమాలు అనవసరం అని కాదు. ఈ ట్రెండ్ కు సెట్ అయ్యేవి కాదు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ వేరు.

ఆడియన్స్ ట్రెండ్ ఇప్పుడు చాలా వేగంగా మారిపోతోంది. సినిమా స్టార్ట్ చేసినప్పటి ట్రెండ్ విడుదల రోజుకు వుండడం లేదు. శివ నిర్వాణ ఖుషీ సినిమా మొదలుపెట్టిన నాటి ట్రెండ్ వేరు. రెండేళ్ల తరువాత విడుదలయిన నాటి ట్రెండ్ వేరు. అది కూడా ఖుషీ మీద బలమైన ప్రభావం కనబర్చినట్లు కనిపిస్తోంది.

పైగా ఇప్పుడు సినిమాలకు మరో సమస్య కూడా వచ్చి పడుతోంది. వన్స్ జారిపోతే జారిపోవడమే తప్ప పబ్లిసిటీతో లేపడం అన్నది సాధ్యం కావడం లేదు. బాగుంది అన్న టాక్ వస్తే ఆపడం ఎంత కష్టమో, బాగాలేదు అన్న టాక్ వస్తే లేపడమూ అంతే కష్టం. డే వన్ న వచ్చిన ట్రెండ్ ఏదయితే వుందో అదే అలా కొనసాగుతోంది. ఈ ఏడాది హిట్ లేదా ప్లాప్ అయిన సినిమా డైలీ ట్రాక్ చూస్తే అది అర్థమైపోతుంది.

ఈ సినిమాను అటెంప్ట్ చేయడమే శివనిర్వాణ చేసిన తప్పు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మధ్యతరగతి కథలు, సీరియళ్లకు పనికి వచ్చే కథలు ఇప్పుడు భారీగా తీద్దాం అంటే కుదరదు. చిన్న సినిమాల సబ్జెక్ట్ లు వేరు. పెద్ద సినిమాల సబ్జెక్ట్ లు వేరు అన్న డివిజన్ క్లారిటీగా కనిపిస్తోంది. కొన్ని సినిమాల విషయంలో ప్రేక్షకులు వన్ టూ మినిట్స్ బోర్ ను కూడా భరించలేకపోతున్నారు. కొన్ని సినిమాల విషయంలో సగం సినిమా బాగున్నా ఓకె అంటున్నారు. జైలర్ లాంటి సినిమా సెకండాఫ్ బాగాలేదు అన్న భావన వున్నా నెత్తిన పెట్టుకున్నారు. అదే ఖుషీ సినిమా సెకండాఫ్ ఓ మాదిరిగా అంటే పక్కన పెట్టారు.

ఇప్పుడు ఇవన్నీ లెక్కలు వేసుకుని కానీ సినిమా చేయడానికి లేదు. ముఖ్యంగా మిడ్ రేంజ్ సినిమాలు చేసే దర్శకులకు ఈ లెక్కలు, ఫార్ములాలు చాలా చిక్కు ముడులే. నిన్ను కోరి, మజిలీ, ఖుషీ ఇలా ఒకటే తరహా జానర్ సినిమాలు చేసే శివినిర్వాణ లాంటి వారికి ఇంకా కష్టమే.