అదేంటో విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చాన్స్ దొరికితే చాలు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీదనే పడిపోతారని టాక్. ఆయన ఎక్కడ ఏం జరిగినా విజయసాయిరెడ్డికే తెచ్చి చుట్టేస్తారని అంటారు.
ఇక లేటెస్ట్ గా మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు మీద కూడా అయ్యన్న ఆయన మార్క్ కామెంట్స్ చేస్తూ వెళ్లారు. నిజమే శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా టీడీపీ ఇదే అంశాన్ని ఇపుడు హైలెట్ చేస్తోంది. ఇక అయ్యన్న దీని మీద ఒక వైపు జగన్ సర్కార్ ని విమర్శిస్తూనే మరో వైపు విజయసాయిరెడ్డిని కూడా ఇందులోకి లాగేస్తున్నారు.
అంతే కాదు విజయసాయిరెడ్డి ప్లాన్ బీ అమలు చేసి ఏకంగా ఏపీకి సీఎం అయిపోదామనుకుంటున్నారని కొత్త మాట కూడా చెప్పారు. ఇప్పటిదాకా విజయసాయిరెడ్డికి కేవలం ఉత్తరాంధ్రాకే సీఎం ని చేసిన అయ్యన్నపాత్రుడు ఇపుడు ఆయన ఏపీకే సీఎం అయిపోదామని అనుకుంటున్నారంటూ అతి పెద్ద బండ వేసేశారు.
మరి విజయసాయిరెడ్డి ఈ విషయంలో తన పైన పడిన నిందను ఆయనే కడుక్కోవాలన్నదే అయ్యన్న ఉద్దేశ్యం. మొత్తానికి విజయసాయిరెడ్డి విశాఖలో ఉండడం టీడీపీ నేతలకు అసలు ఇష్టం లేదు అన్నది తరచూ చెబుతూనే ఉన్నారు.
ఇపుడు జగన్ కి ఆయనకు మధ్య మంట పెట్టేస్తే అయనకు ఆయనే వైజాగ్ వదిలేస్తాడు అని కొత్త ప్లాన్ తో ఇలా మాట్లాడుతున్నారేమో. మరి దీనికి సాయిరెడ్డి మార్క్ కౌంటర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.