రాజధాని కేసుల రోజువారీ విచారణ మళ్లీ హైకోర్టులో మొదలైంది. ఇందుకు సంబంధించి త్రిసభ్య ధర్మాసనం వాదనలు వినడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా హైకోర్టులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు జడ్జిలపై ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. వాళ్లిద్దరిని తప్పించాలని ప్రభుత్వ తరపు న్యాయవాది డిమాండ్ చేయడం, దాన్ని చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా తోసిపుచ్చడం మొదటి రోజు విచారణలో సంచలనంగా చెప్పొచ్చు.
పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్‌ల బదిలీల వల్ల తరచూ విచారణ వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల కొత్తగా వచ్చిన చీఫ్ జస్టిస్ మిశ్రా నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఏర్పడింది. ఇందులో జస్టిస్ సత్యనారాయణ, జస్టిస్ సోమయాజులు ఉన్నారు.
విచారణలో మొదటి రోజే ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ త్రిసభ్య ధర్మాసనంలోని జస్టిస్ సత్యనారాయణ, జస్టిస్ సోమయాజులను తప్పించాలని చీఫ్ జస్టిస్‌ను కోరారు. కారణం ఏంటని చీఫ్ ప్రశ్నించగా… వీళ్లద్దరికీ అమరావతి రాజధానిలో భూములున్నాయని చెప్పారు. కావున వాళ్లను తప్పించడమే న్యాయమని విన్నవించారు. ప్రభుత్వ తరపు న్యాయవాది విన్నపాన్ని చీఫ్ జస్టిస్ కొట్టి పారేశారు.
ఇదిలా వుండగా వీళ్లద్దరిపై గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు సీఎం వైఎస్ జగన్ ఫిర్యాదు చేయడం తెలిసిందే. త్రిసభ్య ధర్మాసనంలో వీళ్లద్దరూ ఉండడంపై ఇప్పటికే ఏపీలో చర్చనీయాంశమైంది. ఇద్దరు జడ్జిలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని బట్టి… రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి.