మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనను తాను దూషించుకున్నారు. ఇదంతా కుప్పం మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్. కుప్పం ఎన్నికలు జరుగుతున్న దశలో కూడా సానుభూతి కోసం చంద్రబాబు తిప్పలు చూస్తుంటే నాలుగు దశాబ్దాల పైబడి రాజకీయ అనుభవశాలికి ఏమిటీ దౌర్భాగ్యం అనే అభిప్రాయం కలగకమానదు.
ఒకవైపు కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతుంటే… పరిశీలన నిమిత్తం చంద్రబాబు అక్కడికి వెళ్తారని ఎల్లో మీడియా ఊదరగొట్టింది. కానీ బాబు అక్కడికి వెళ్లలేదు. తాను కుప్పం వస్తున్నానంటే వైసీపీ శ్రేణులు భయపడతాయని ఎత్తుగడ వేశారో లేక మరే కారణమో తెలియదు. కుప్పం మున్సిపల్ ఎన్నికలపై మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబు చిందులు తొక్కారు.
చరిత్రలో ఎన్నికలను ఇంత అపహాస్యం చేసిందెన్నడూ లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు పనులు చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు. వైసీపీ నేతలు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? ఇలాగైతే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వస్తారని ఘాటు హెచ్చరికలు చేశారు.
దొంగ ఓట్లు వేయబోతున్నారని ముందే చెప్పామన్నారు. మున్సిపల్ ఎన్నికలను కూడా అపహాస్యం చేసిన ఘటనలా? ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి ఇన్ని కుట్రలా?గెలిచామని చెప్పుకోవడానికి అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఏం చేసినా జరిగిపోతుందనుకుంటే శిక్ష తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అడుగడుగునా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రతి ఘటనపైనా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణ చేతకాకుంటే ఎస్ఈసీ వెళ్లిపోవాలని బాబు డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏపీలో చంద్రబాబుకు ముందు, తర్వాత అని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు పార్లమెంట్ సభ్యుల్ని తమ పార్టీలో చేర్చుకున్నప్పుడు ఎక్కడికి పోయింది ప్రజాస్వామ్యమని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
కుప్పంలో ఓడిపోతామని తెలిసి దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారని విమర్శిస్తున్నారు. టీడీపీ ఓటమిని చంద్రబాబు మాటలు ప్రతిబింబిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాబు చేసిన పనులు ఆయన్ను చరిత్ర హీనుడిగా నిలిపాయని, ఆ విషయాన్ని ఇప్పటికైనా ఆయన గ్రహిస్తే మంచిదని పలువురు హితవు చెబుతున్నారు.