తెలంగాణ రాజకీయాల్లోకి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ప్రవేశించనున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితుడిగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి గుర్తింపు పొందారు. కీలక బాధ్యతల్ని కలెక్టర్ వెంకట్రామిరెడ్డికే అప్పగిస్తారనే ప్రచారం ఉంది. ఇటీవల వరి సాగుపై వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో వెంకట్రామిరెడ్డిని ఎంపిక చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో 19 ఎమ్మెల్సీ స్థాన్థాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల నుంచి 12, ఎమ్మెల్యే కోటాలో 6, గవర్నర్ కోటా నుంచి ఒకస్థానం భర్తీ చేయాల్సి ఉంది.
ఎమ్మెల్యేల కోటాలో సీనియర్ నాయకులను టీఆర్ఎస్ ఖరారు చేసింది. స్థానిక సంస్థల విషయానికి వస్తే సిద్దిపేట కలెక్టర్ పేరు బలంగా వినిపిస్తోంది.
ప్రగతి భవన్ నుంచి అధికారిక సమాచారం వస్తే… తన పదవికి రాజీనామా చేయడానికి వెంకట్రామిరెడ్డి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రేపటితో నామినేషన్ల స్వీకరణ ముగియనున్న నేపథ్యంలో ఏ క్షణంలోనైనా ఏమైనా జరగొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలుస్తారని వెంకట్రామిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. తాజాగా మరోసారి రాజకీయ తెరపైకి ఆయన పేరు రావడం గమనార్హం. ఈ ప్రచారం నిజం కావాలని వెంకట్రామిరెడ్డి సన్నిహితులు కోరుకుంటున్నారు.